భారత క్రికెట్ స్టార్లకు స్వదేశంలో ఉండే ఆదరణ, అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారు బయటకు వస్తే చాలు, అభిమానులు చుట్టుముడతారు. అయితే, విదేశీ పర్యటనల్లో మాత్రం వారికి పూర్తి భిన్నమైన అనుభవం ఎదురవుతుంది. తాజాగా టీమిండియా ఆటగాళ్లు రోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్ విషయంలో ఇదే జరిగింది.

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు రోహిత్ శర్మ, కుల్దీప్ ఆక్లాండ్ వీధుల్లో సరదాగా షికారు చేస్తూ కనిపించారు. సాధారణ దుస్తుల్లో సెక్యూరిటీ సిబ్బందితో కలిసి మాట్లాడుకుంటూ నడుస్తున్న వీరిని స్థానికులు ఎవరూ గుర్తుపట్టినట్లు కనిపించలేదు. ఎలాంటి హడావుడి లేకుండా, పూర్తి స్వేచ్ఛగా వారు తమ సమయాన్ని ఆస్వాదించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఈ వీడియో చూసిన అభిమానులు.. విదేశాల్లో భారత క్రికెటర్లకు లభించే ప్రశాంతత, వ్యక్తిగత స్వేచ్ఛపై చర్చించుకుంటున్నారు. కాగా, ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం రోహిత్ శర్మ గత వారమే న్యూజిలాండ్ చేరుకున్నాడు. ఇక కుల్దీప్ యాదవ్ ఇప్పటికే అక్కడ ముగిసిన టీ20 సిరీస్‌లో జట్టులో ఉన్నప్పటికీ, ఆడే అవకాశం రాలేదు. కనీసం వన్డే సిరీస్‌లోనైనా తుది జట్టులో చోటు దక్కించుకోవాలని ఆశిస్తున్నాడు.