న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌లో రోహిత్‌ శర్మ కంటే విరాట్‌ కోహ్లీకి సెంచరీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భారత మాజీ క్రికెటర్‌ చతేశ్వర్‌ పుజారా అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో కోహ్లీ మూడో స్థానంలో రావడం అతడికి ఇన్నింగ్స్‌ను నిర్మించుకునే అవకాశం కల్పిస్తుందని చెప్పాడు. అదే సమయంలో ఓపెనర్‌గా రోహిత్‌ పవర్‌ప్లేలో దూకుడుగా ఆడాల్సి ఉంటుందని, న్యూజిలాండ్‌ పిచ్‌లపై అతడి పాత్రలో మార్పు ఉండొచ్చని పేర్కొన్నాడు.

జియోస్టార్‌తో మాట్లాడిన పుజారా.. ‘‘రోహిత్‌ సాధారణంగా పవర్‌ప్లేలో జట్టుకు మంచి ఆరంభం అందించడంపై దృష్టి పెడతాడు. న్యూజిలాండ్‌ పరిస్థితుల్లో అతడి పాత్ర మారవచ్చు. అయితే కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడు. ఇన్నింగ్స్‌ను నిలబెట్టి ఆడటం అతడి ఆటతీరులో కీలకం. ఈ స్థానంలో వచ్చే బ్యాటర్‌కు వన్డేల్లో సెంచరీ చేసే అవకాశం కొంత ఎక్కువగా ఉంటుంది. అందుకే రోహిత్‌ కంటే కోహ్లీకి శతకం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నా’’ అని వివరించాడు.

ఈ సిరీస్‌ హోరాహోరీగా సాగుతుందని పుజారా అంచనా వేశాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ 2-2తో ముగుస్తుందని, వర్షం కారణంగా ఓ మ్యాచ్‌ రద్దయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాడు. తొలి మూడు మ్యాచ్‌ల్లో ఆడే భారత జట్టు, చివరి రెండు మ్యాచ్‌ల్లో బరిలోకి దిగే జట్టు వేరుగా ఉండనుండటం న్యూజిలాండ్‌కు కొంత అనుకూలిస్తుందని అభిప్రాయపడ్డాడు.

అయితే తొలి మూడు మ్యాచ్‌ల్లో భారత జట్టు మెరుగ్గా రాణిస్తుందని పుజారా విశ్వాసం వ్యక్తం చేశాడు. చివరి రెండు మ్యాచ్‌లు టీమిండియాకు కొంత సవాలుగా మారవచ్చని అన్నాడు. న్యూజిలాండ్‌లో వర్షాలు కూడా మ్యాచ్‌ల ఫలితాలపై ప్రభావం చూపవచ్చని పేర్కొన్నాడు.