మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టును బీజేపీ అడ్డుకుంటోందని కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు మండిపడ్డారు. మూసీ ప్రక్షాళనను తమ పార్టీ వ్యతిరేకించడం లేదని, అయితే 'గాంధీ సరోవరం' పేరిట పేదల ఇళ్లను కూల్చివేయడాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాంచందర్ రావు మాట్లాడారు. పేదల ఇళ్లకు ఎలాంటి నష్టం జరగకుండా మూసీని శుభ్రపరిచే ప్రణాళికలు ప్రభుత్వం సిద్ధం చేయాలని సూచించారు. ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇవ్వడానికి నిధులు లేవని చెబుతున్న ప్రభుత్వం, మూసీ ప్రక్షాళన పేరుతో వేల కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధమవ్వడం విచిత్రంగా ఉందన్నారు. ఈ ప్రాజెక్టుకు ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఆయన ప్రశ్నించారు.

ఢిల్లీలో విపక్షాలు తలపెట్టిన 'మాక్ పార్లమెంట్'పైనా రాంచందర్ రావు తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో యూపీఏ హయాంలో ములాయం సింగ్ యాదవ్ నాయకత్వంలో మాక్ పార్లమెంట్ నిర్వహిస్తే, దాన్ని ఎందుకు నిర్వహిస్తున్నారని సోనియా గాంధీ ప్రశ్నించిన విషయాన్ని గుర్తు చేశారు. పార్లమెంట్‌ను ప్రజాస్వామ్య దేవాలయంగా అభివర్ణించిన కాంగ్రెస్ నేత, మాజీ స్పీకర్ మీరా కుమార్ విషయాన్ని ప్రస్తావిస్తూ... ఇప్పుడు అదే కాంగ్రెస్ నేతలు రాజకీయ స్వలాభం కోసం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.