‘అర్నాబ్’ తుపాను ఆంధ్రప్రదేశ్‌లో మిగిల్చిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించింది. ఆదివారం కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించింది. తుపాను వల్ల జరిగిన నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పిస్తామని బృంద సభ్యులు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ చిత్తరంజన్ దాస్ నేతృత్వంలోని బృందం కాకినాడ జిల్లాలో పర్యటించింది. ఉప్పాడ తీర ప్రాంతం, కాకినాడ ఫిషింగ్ హార్బర్‌తో పాటు దెబ్బతిన్న ఉప్పాడ రహదారిని అధికారులు పరిశీలించారు. తాళ్లరేవు, పిఠాపురం, కాజులూరు మండలాల్లోని అరటి తోటలను, పోలేకుర్రు, కొలంక గ్రామాల్లో నీట మునిగిన వరి పొలాలను సందర్శించి నష్టాన్ని అంచనా వేశారు. ఫిషింగ్ హార్బర్‌లో పాడైన పడవలు, వలల గురించి మత్స్యకారులను అడిగి తెలుసుకున్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ అందించి తమను ఆదుకోవాలని రైతులు కోరగా, సంభవించిన నష్టంపై పూర్తిస్థాయి నివేదిక ఇస్తామని అధికారులు తెలిపారు. ఈ పర్యటనలో రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్టర్ ప్రఖర్ జైన్, జిల్లా ఎస్పీ బిందుమాధవ్ తదితర అధికారులు పాల్గొన్నారు.

మరో బృందం పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో పర్యటించింది. దెబ్బతిన్న పంటలు, ఆక్వా చెరువులు, కూలిపోయిన విద్యుత్ స్తంభాలను బృందం సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించారు. నరసాపురం పట్టణంతో పాటు లిఖితపూడి, చినలంక, బియ్యపుతిప్ప వంటి గ్రామాల్లో జరిగిన నష్టాన్ని జిల్లా కలెక్టర్ నాగరాని కేంద్ర బృందానికి వివరించారు. అధికారులు రైతులు, మత్స్యకారులు, మహిళలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.