ఐడీబీఐ బ్యాంకులో మెజారిటీ వాటా విక్రయించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమర్థించారు. ఈ విక్రయంపై కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ చేసిన విమర్శలకు ఆమె స్పందించారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు బ్యాంకులపై రాజకీయ ఒత్తిళ్లు తెచ్చి, నిబంధనలకు విరుద్ధంగా రుణాలు ఇప్పించాయని ఆరోపించారు. వాటి ఫలితంగానే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో భారీగా మొండి బకాయిలు పేరుకుపోయాయని విమర్శించారు.

బ్యాంకులు, ఆర్థిక సంస్థలను కాంగ్రెస్‌ నేతలు తమ సొంత సంస్థల్లా వాడుకున్నారని నిర్మలా సీతారామన్‌ ఎక్స్‌లో పేర్కొన్నారు. తమకు నచ్చిన సంస్థలకు రుణాలు ఇవ్వాలని బ్యాంకు ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. 1976లో ఇందిరా గాంధీ ప్రభుత్వం.. సంజయ్‌ గాంధీ వర్గానికి సంబంధమున్న సంస్థకు రుణాల విషయంలో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గని ఎస్‌బీఐ ఛైర్మన్‌ ఆర్‌.కె. తల్వార్‌ను పదవి నుంచి తొలగించిందని గుర్తుచేశారు. మారుతి సంస్థకు రుణాల విషయంలోనూ ‘సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’పై సంజయ్‌ గాంధీ ఒత్తిడి తెచ్చారని ఆమె ఆరోపించారు.

ఐడీబీఐ బ్యాంక్‌ గతంలో తీవ్ర సమస్యల్లో కూరుకుపోయిందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. వీడియోకాన్‌, విన్‌సమ్‌, ఏబీజీ షిప్‌యార్డ్‌, కింగ్‌ఫిషర్‌ వంటి పెద్ద సంస్థలకు ఇచ్చిన రుణాలు మొండి బకాయిలుగా మారి బ్యాంకుకు భారీ నష్టాలు తెచ్చాయని తెలిపారు. ఈ సంస్థలకు కాంగ్రెస్‌ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వృత్తిపరమైన నిర్వహణ, జాగ్రత్తతో కూడిన రుణ విధానాలు, రూ.25 వేల కోట్లకు పైగా మూలధన సాయం ద్వారా బ్యాంకును తిరిగి గాడిలో పెట్టిందని చెప్పారు. ఐడీబీఐ పునర్వ్యవస్థీకరణలో అన్ని నిబంధనలను పాటించామని స్పష్టం చేశారు.

2024 ఫిబ్రవరిలో కేంద్రం విడుదల చేసిన భారత ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రంలో గత ప్రభుత్వాల హయాంలో చోటుచేసుకున్న ఆర్థిక అవకతవకల వివరాలు ఉన్నాయని నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ హయాంలో.. పలుకుబడి ఉన్నవారికి ఒక రకంగా, సామాన్యులకు మరో రకంగా బ్యాంకింగ్‌ సేవలు అందేవని విమర్శించారు.

ఈ నెల 14న ఐడీబీఐ బ్యాంకులో 60.72 శాతం వాటాను కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్‌ ఫైనాన్షియల్‌ హోల్డింగ్స్‌కు సుమారు రూ.53 వేల కోట్లకు విక్రయించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇది భారత బ్యాంకింగ్‌ రంగంలో అతిపెద్ద విదేశీ పెట్టుబడిగా నిలవనుంది. ఈ నిర్ణయాన్ని రాహుల్‌ గాంధీ విమర్శిస్తూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వాలు బ్యాంకులను ఏర్పాటు చేస్తే, మోదీ ప్రభుత్వం వాటిని విక్రయిస్తోందని వ్యాఖ్యానించారు. ఐడీబీఐ ఉద్యోగులకు అండగా ఉంటానని ఆయన తెలిపారు.