అనంతపురం జిల్లా రాప్తాడులో ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన పదో తరగతి విద్యార్థినిని వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. బాధితురాలు ప్రస్తుతం బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడారు. బాలిక ఆరోగ్య పరిస్థితి, ఆమెకు అందిస్తున్న వైద్య సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం, బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి మనోధైర్యాన్ని కల్పించారు. పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

అక్టోబర్ 31న రాప్తాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తరగతి గదిలోనే బాధితురాలిపై ఓ ఉన్మాది (రంపపు మిషన్)తో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దారుణ ఘటనలో బాలిక తీవ్రంగా గాయపడింది. మెరుగైన చికిత్స కోసం ఆమెను బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది.