మహారాష్ట్రలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సమాధి అంశం మరోసారి రాజకీయ వేడిని రాజేసింది. ఔరంగజేబ్ సమాధిని తొలగించేందుకు ఇప్పటికే గడువు నిర్ణయించామని, అయితే ఆ తేదీని ప్రస్తుతం రహస్యంగా ఉంచుతున్నామని రాష్ట్ర మంత్రి నితేశ్ రాణే సంచలన ప్రకటన చేశారు. ఈ వ్యాఖ్యలతో సమాధి తొలగింపు వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది.

ఛత్రపతి శంభాజీ నగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో నితేశ్ రాణే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ఔరంగజేబ్ సమాధిని తొలగించడానికి గడువు ఖరారైంది. ఆ తేదీ ఏంటనేది ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు తెలుసు. సరైన సమయంలో ఆయనే ఆ తేదీని ప్రకటిస్తారు" అని పేర్కొన్నారు.

ఔరంగజేబ్ సమాధిని తొలగించాలనే డిమాండ్ మహారాష్ట్రలో కొత్తదేమీ కాదు. 2025 మార్చిలో బీజేపీ నాయకులు, పలు హిందుత్వ సంస్థలు ఈ డిమాండ్‌ను బలంగా వినిపించాయి. అప్పట్లోనూ మంత్రి నితేశ్ రాణే ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన చేసిన ప్రకటనతో ఈ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ప్రధాన చర్చనీయాంశంగా మారింది.