జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌ను తరలించాలనే డిమాండ్‌తో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేపట్టిన పాదయాత్ర ఉద్రిక్తంగా సాగుతోంది. ఈ క్రమంలో ఆయన రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేవలం డంపింగ్ యార్డ్ తరలించేంతవరకే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే వరకు తన యాత్ర ఆగదని ఆయన హెచ్చరించారు.

పనిలేక తిరుగుతున్నానంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలపై ఈటల ఘాటుగా స్పందించారు. "డంపింగ్ యార్డ్ తొలగింపు కోసం నేను పాదయాత్ర చేస్తుంటే, ఈటల రాజేందర్‌కు పనిలేక తిరుగుతున్నాడని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కేవలం డంపింగ్ యార్డ్ తరలించేదాకా మాత్రమే కాదు.. మీ ప్రభుత్వం కూలిపోయే వరకు నేను తిరుగుతూనే ఉంటా" అని ఆయన స్పష్టం చేశారు.

జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ రీసైక్లింగ్ కోసం అయ్యే ఖర్చుపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) సిద్ధం చేయాలని ఈటల డిమాండ్ చేశారు. నివేదిక ఇస్తే, ప్రధానమంత్రి మోదీని ఒప్పించి అవసరమైన నిధులను తానే తీసుకొస్తానని ప్రకటించారు. ఒకవేళ తాను నిధులు తీసుకురావడంలో విఫలమైతే, రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు.

అక్టోబర్ 27న ఏదులాబాద్‌లోని శ్రీరంగనాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఈటల తన పాదయాత్రను ప్రారంభించారు. డంపింగ్ యార్డ్ కాలుష్యం వల్ల పరిసర గ్రామాలు, కాలనీల్లోని ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోందని, గాలి, భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని, తక్షణమే దాన్ని తరలించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.