రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) అధినేత్రి కల్వకుంట్ల కవిత తమ పార్టీ అభ్యర్థులను ఖరారు చేశారు. హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పార్టీ అభ్యర్థిగా ప్రముఖ జర్నలిస్ట్ ఆకాశ్ కొల్లూరు పేరును ప్రకటించారు.

సుమారు 20 ఏళ్లుగా జాతీయ మీడియా రంగంలో పనిచేస్తున్న ఆకాశ్ కొల్లూరు... ఇండియాటుడే, రిపబ్లిక్ టీవీ, సీఎన్ఎన్ న్యూస్ 18, డైలీ హంట్ వంటి సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో పాఠశాల విద్యను, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్‌తో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. విద్యావంతుడు, జాతీయ మీడియా అనుభవం ఉన్న బీసీ నేత కావడంతో పట్టభద్రుల మద్దతు తమకే లభిస్తుందని టీఆర్‌ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఇప్పటికే వరంగల్ - ఖమ్మం - నల్గొండ స్థానం నుంచి బీసీ వర్గానికి చెందిన నలమాస శ్రీకాంత్ గౌడ్‌ను టీఆర్‌ఎస్ బరిలో దింపిన సంగతి తెలిసిందే. తాజా ప్రకటనతో రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ బీసీలనే నిలబెట్టినట్లయింది. ఈ ఎన్నికల కోసం హైదరాబాద్ స్థానానికి అబ్జర్వర్‌గా డాక్టర్ చిట్నేని రఘును... రెండు నియోజకవర్గాల ఎన్నికల వ్యూహాలు, వార్ రూమ్ ఇన్‌చార్జ్‌గా న్యాయవాది రామ్ కల్యాణ్ చల్లాను నియమిస్తూ కవిత నిర్ణయం తీసుకున్నారు.