న్యూజిలాండ్‌తో నాలుగో టీ20కి టీమిండియా సిద్ధమైంది. ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్‌.. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ఆధిక్యాన్ని మరింత పెంచుకోవాలని చూస్తోంది. అయితే తుది జట్టు ఎంపికలో ఓ చిక్కు ఎదురవుతోంది. గాయం నుంచి కోలుకుంటున్న ఇషాన్‌ కిషన్‌ తిరిగి జట్టులోకి వస్తే ఎవరిని పక్కనపెట్టాలన్నది ఆసక్తికరంగా మారింది. యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీని కొనసాగించాలా? సంజూ శాంసన్‌కు మళ్లీ ఓపెనింగ్‌ బాధ్యతలు అప్పగించాలా? అన్న చర్చ మొదలైంది. 

వైభవ్‌ మెరుపులతో మారిన లెక్కలు
వెల్లింగ్టన్‌లో జరిగిన మూడో టీ20లో వైభవ్‌ సూర్యవంశీ 19 బంతుల్లోనే 45 పరుగులు చేశాడు. అభిషేక్‌ శర్మతో కలిసి తొలి వికెట్‌కు 133 పరుగులు జోడించాడు. వీరిద్దరి దూకుడుతో భారత్‌ 199 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.2 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో వైభవ్‌ను కొనసాగించాలన్న వాదనకు బలం చేకూరింది. 

ఇషాన్‌ ఫిట్‌నెస్‌పైనే అందరి దృష్టి
తొలి టీ20లో తొడ కండరాల గాయానికి గురైన ఇషాన్‌ కిషన్‌.. రెండు, మూడో మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఆక్లాండ్‌లో భారత జట్టు సాధన సమయంలో అతడు నెట్స్‌లో బ్యాటింగ్‌ చేశాడు. అయితే నాలుగో టీ20కి అందుబాటులో ఉంటాడా? లేదా? అన్నది ఇంకా స్పష్టత రాలేదు. సిరీస్‌ను భారత్‌ ఇప్పటికే 3-0తో కైవసం చేసుకోవడంతో మరి అతడిని ఆడిస్తారా? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. 

స్పిన్నర్లకు అవకాశం దక్కేనా?
కుల్దీప్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి ఇప్పటివరకు ఈ సిరీస్‌లో ఆడలేదు. సిరీస్‌ భారత్‌ చేతిలోకి రావడంతో మిగిలిన మ్యాచ్‌ల్లో కొత్త ఆటగాళ్లకు అవకాశాలు కల్పించవచ్చనే అంచనాలున్నాయి. మరోవైపు ఆక్లాండ్‌లోని ఈడెన్‌ పార్క్‌ మైదానంలో బౌండరీలు చిన్నగా ఉండటంతో బౌలర్ల ఎంపిక కీలకం కానుంది. ఇషాన్‌ ఫిట్‌నెస్‌, జట్టు సమతూకాన్ని బట్టి తుది జట్టులో మార్పులు ఉండొచ్చు.