రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) కార్యక్రమ షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) మరోసారి మార్పు చేసింది. రెండు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారుల (సీఈవోలు) విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. తాజా మార్పులతో రెండు రాష్ట్రాల్లోనూ ఓటర్ల తుది జాబితా నవంబర్ 30వ తేదీన ప్రచురితం కానుంది.

ఈ మేరకు ఎన్నికల సంఘం రెండు రాష్ట్రాల సీఈవోలకు వేర్వేరుగా సమాచారం అందించింది. ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులపై వచ్చిన క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారానికి సంబంధించిన గడువును తెలంగాణలో నవంబర్ 26 వరకు, ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 20 వరకు పొడిగించింది. 

వాస్తవానికి పాత షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో నవంబర్ 9న, ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్ 30నే తుది జాబితా విడుదల కావాల్సి ఉంది. అయితే, క్షేత్రస్థాయిలో ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడంతో సీఈవోల అభ్యర్థన మేరకు ఈసీ గడువును పొడిగించింది.

సవరించిన షెడ్యూల్ వివరాలను క్షేత్రస్థాయి అధికారులందరికీ తెలియజేయాలని, మీడియా ద్వారా ప్రజలకు విస్తృత ప్రచారం కల్పించాలని ఈసీ తమ ఆదేశాల్లో స్పష్టం చేసింది. అదేవిధంగా మార్పు చేసిన షెడ్యూల్ గురించి రాజకీయ పార్టీలకు కూడా రాతపూర్వకంగా సమాచారం అందించాలని సూచించింది.

గణాంకాల వివరాలు
ప్రత్యేక సవరణ ప్రక్రియ ప్రారంభానికి ముందు తెలంగాణలో 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా, వారిలో 2,64,87,213 మంది మాత్రమే తమ వివరాలను నమోదు చేసుకున్నారు. మిగిలిన 73,39,235 మంది ఓటర్లను వలస వెళ్లినవారు, మరణించినవారు, చిరునామా మారినవారు, నకిలీ ఓట్ల (ASDD) కేటగిరీ కింద గుర్తించి డ్రాఫ్ట్ జాబితా నుంచి తొలగించారు.

అక్టోబర్ 29 నాటికి అందిన సమాచారం ప్రకారం.. తెలంగాణలో జారీ చేసిన 92,88,188 నోటీసులకు గానూ 92,81,189 నోటీసులు ఓటర్లకు అందజేశారు. వీటిలో 92,08,443 నోటీసులపై విచారణ పూర్తయింది. ఇప్పటివరకు మొత్తం 2,59,22,684 మంది ఓటర్ల పేర్లను తుది జాబితాలో చేర్చడానికి అధికారులు ఆమోదం తెలిపారు. 

వీరిలో 59,31,395 మంది ఓటర్ల విషయంలో ఉన్న సాంకేతిక సమస్యలను పరిష్కరించారు. మరో 30,64,168 మందిని 2002 నాటి జాబితా నుంచి మ్యాపింగ్ చేశారు. విచారణ అనంతరం 50,690 మంది ఓటర్లు జాబితాలో చేరడానికి అర్హులు కారని అధికారులు తేల్చారు.

ఇక, ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి 44,28,858 నోటీసులపై విచారణ పూర్తయింది. వీరిలో 42,55,630 మంది ఓటర్ల పేర్లను తుది జాబితాలో చేర్చడానికి ఆమోదం లభించింది. పరిశీలన తర్వాత 1,73,662 మంది ఓటర్లు జాబితాలో చోటు దక్కించుకోవడానికి అర్హులు కారని అధికారులు నిర్ధారించారు.