ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షల మంది ఫాలోవర్లు.. యూట్యూబ్‌లో భారీ సంఖ్యలో వీక్షకులు.. కానీ సర్పంచ్‌ ఎన్నికల్లో మాత్రం కేవలం 33 ఓట్లు! రాజస్థాన్‌కు చెందిన సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ ఓంప్రకాశ్‌ బిష్ణోయ్‌కు ఎదురైన ఈ ఫలితం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆన్‌లైన్‌లో లక్షల మందికి చేరువైన ఆయనకు సొంత గ్రామంలో మాత్రం ఆశించిన మద్దతు దక్కలేదు.

ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లలో కలిపి ఓంప్రకాశ్‌కు సుమారు 21 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇంతటి ఆదరణ ఉన్న ఆయన.. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ జిల్లా ఓసియాన్‌ తహసీల్‌ పరిధిలో ఉన్న ఇండోన్‌ కీ ధానీ గ్రామ పంచాయతీలో సర్పంచ్‌ పదవికి పోటీ చేశారు. అక్కడ సుమారు 1,600 మంది ఓటర్లు ఉండగా.. ఆయనకు 33 ఓట్లు మాత్రమే వచ్చాయి. మరో అభ్యర్థి అయిన ఉపాధ్యాయుడికి 527 ఓట్లు పోలయ్యాయి. కార్ల వ్యాపారం చేసే అభ్యర్థి సర్పంచ్‌గా గెలిచారు.

ఎన్నికల్లో గెలిస్తే గ్రామంలోని ప్రతి చిన్నారికి విద్య అందించడం, అనాథ జంతువులను ఆదుకోవడం, ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా చూడటం తన లక్ష్యాలని ఓంప్రకాశ్‌ చెప్పారు. తాను సుమారు 1,500 ఆవులున్న గోశాలను నిర్వహిస్తున్నానని, దాని కోసం 30 బిగాల భూమిని దానం చేశానని తెలిపారు. గ్రామస్థులు తనను పోటీ చేయాలని ప్రోత్సహించడంతో గెలుపుపై నమ్మకం పెట్టుకున్నానన్నారు. 

అయితే ఫలితాలు మాత్రం ఆయన అంచనాలకు భిన్నంగా వచ్చాయి. తనకు వచ్చిన 33 ఓట్లలో 11 ఓట్లు కుటుంబ సభ్యులవేనని ఓంప్రకాశ్‌ వెల్లడించారు. మిగిలిన ఓట్లు సన్నిహితులు, తనతో కలిసి చదువుకున్నవారు వేశారని చెప్పారు. సోషల్‌ మీడియాలో ఆదరణ వేరు.. క్షేత్రస్థాయిలో ప్రజల మద్దతు వేరని ఈ ఎన్నిక తనకు అర్థమయ్యేలా చేసిందన్నారు. ఓటమితో వెనక్కి తగ్గబోనని, గ్రామ ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.