ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌ బైనాన్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా ఉల్లంఘన ఘటనపై దర్యాప్తు చేపట్టిన నేపథ్యంలో డిపాజిట్లు, విత్‌డ్రాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ ఘటన వల్ల సుమారు 6.3 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.6 లక్షల కోట్లు) మేర ప్రభావం ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేసింది.

తొలుత జరిపిన విచారణలో ఓ డెవ్‌ఆప్స్‌ ఇంజినీర్‌ ల్యాప్‌టాప్‌ హ్యాక్‌ అయి ఉండొచ్చని బైనాన్స్‌ తెలిపింది. దాని ద్వారా దుండగులు ఓ సర్వీస్‌ కంటైనర్‌లోకి ప్రవేశించి, అనధికారికంగా నగదు ఉపసంహరణ లావాదేవీలకు ప్రయత్నించినట్లు పేర్కొంది. అయితే క్రిప్టో వాలెట్లకు సంబంధించిన ప్రైవేటు కీలు లీకైనట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేసింది.

ఈ ఘటనతో ప్రభావితమైన ఆస్తులను నిలిపివేసేందుకు బ్లాక్‌చైన్‌ భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇప్పటివరకు బ్లాక్‌చైన్‌లోనే సుమారు 3 బిలియన్‌ డాలర్ల విలువైన ఆస్తులను ఫ్రీజ్‌ చేసినట్లు తెలిపింది. వినియోగదారుల నిధులు సురక్షితంగానే ఉన్నాయని, జరిగిన నష్టాన్ని ఎస్‌ఏఎఫ్‌యూ ఫండ్‌తో పాటు సంస్థ సొంత నిధుల నుంచి భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. అనుమానిత చిరునామాల అనుమతులను రద్దు చేసి, నిధుల జాడ తెలుసుకునేందుకు దర్యాప్తు సంస్థలు, బ్లాక్‌చైన్‌ నిపుణులతో కలిసి పనిచేస్తున్నట్లు పేర్కొంది.

దర్యాప్తు పూర్తయి, భద్రతా చర్యలు ముగిసిన తర్వాత డిపాజిట్లు, విత్‌డ్రాలను పునరుద్ధరిస్తామని బైనాన్స్‌ తెలిపింది. పూర్తి సాంకేతిక నివేదికను కూడా విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. మరమ్మతు చర్యలు పూర్తయ్యాక తాజా ‘ప్రూఫ్‌ ఆఫ్‌ రిజర్వ్స్‌’ వివరాలను ప్రకటిస్తామని పేర్కొంది.

మరోవైపు ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత క్రిప్టో మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. బిట్‌కాయిన్‌ ధర 77 వేల డాలర్ల దిగువకు పడిపోయి, సెప్టెంబరు తర్వాత కనిష్ఠ స్థాయిని తాకింది. ఇతర క్రిప్టో టోకెన్ల ధరలూ తగ్గాయి. ఈ హ్యాక్‌ నిర్ధారణ అయితే, 2025 ఫిబ్రవరిలో బైబిట్‌ ఎక్స్ఛేంజ్‌లో జరిగిన 1.5 బిలియన్‌ డాలర్ల చోరీని మించిన అతిపెద్ద క్రిప్టో దోపిడీగా నిలిచే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.