విశాఖపట్నం రీజియన్‌కు సేవలందించే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై ప్రయాణికుల్లో కొంత గందరగోళం కొనసాగుతోంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన ఈ కొత్త విమానాశ్రయం, గత ఆగస్టు 17వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించింది. అయితే, దీనికి కేటాయించిన IATA కోడ్, ప్రదేశం విషయంలో ఇప్పటికీ స్పష్టత కొరవడుతోంది.

గతంలో విశాఖపట్నం నగరంలోని ఐఎన్ఎస్ డేగా వద్ద ఉన్న సివిల్ ఎన్‌క్లేవ్ నుంచి విమాన సర్వీసులు నడిచేవి. దీని IATA కోడ్ 'VTZ'. అయితే, భోగాపురంలో కొత్త గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ప్రారంభమవడంతో, పాత ఎయిర్‌పోర్ట్‌ను వాణిజ్య కార్యకలాపాలకు మూసివేశారు. అదే సమయంలో, 'VTZ' కోడ్‌ను భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి బదిలీ చేశారు.

విమానాశ్రయం భౌగోళికంగా భోగాపురంలో ఉన్నప్పటికీ, విశాఖపట్నం నగరానికి సేవలందిస్తుండటంతో టికెట్ బుకింగ్ వెబ్‌సైట్లలో అయోమయం నెలకొంది. 'VTZ' కోడ్‌ను చూసి చాలామంది ప్రయాణికులు అది విశాఖ నగరంలోని విమానాశ్రయంగా భావిస్తున్నారు. వాస్తవానికి, ఈ ఎయిర్‌పోర్ట్ విశాఖ నగరానికి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గందరగోళం నేపథ్యంలో  IATA కీలక ప్రకటన చేసింది.

ఈ విమానాశ్రయం నగరం పేరును భోగాపురం నుంచి విశాఖపట్నంగా మార్చుతున్నట్లు తెలిపింది. ఈ మార్పు ఈ ఏడాది నవంబర్ 21 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఎయిర్‌పోర్ట్ కోడ్, నగరం విషయంలో కొంత గందరగోళం నెలకొనడంతో ఈ మార్పు చేస్తున్నట్లు ఐఏటీఏ వివరించింది. ఇప్పటివరకు ఈ విమానాశ్రయ వివరాలు VTZ కోడ్‌తో, భోగాపురం నగరంతో అనుసంధానమై ఉన్నాయి. నవంబర్ 21 నుంచి కోడ్ VTZ గానే ఉన్నప్పటికీ, నగరం పేరు భోగాపురం స్థానంలో విశాఖపట్నంగా కనిపిస్తుంది.

ఈ మార్పు వల్ల టికెట్ బుకింగ్ వెబ్‌సైట్లలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు, గందరగోళం ఉండవని ప్యాసింజర్స్ అసోసియేషన్ పేర్కొంది. విశాఖపట్నం పేరుతో ఉండటం వల్ల ప్రయాణికులు సులభంగా విమానాశ్రయాన్ని గుర్తించి టికెట్లు బుక్ చేసుకునేందుకు వీలు కలుగుతుంది.