విద్యార్థులకు ఉపయోగపడేలా గూగుల్‌ కీలక ప్రకటన చేసింది. తన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ప్లాట్‌ఫామ్‌ జెమినీ నోట్‌బుక్‌లో వందలాది పాఠ్యపుస్తకాలను ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. అమెరికా, భారత్‌లోని ప్రచురణ సంస్థలు, విద్యా వనరుల నుంచి ఈ పుస్తకాలను తీసుకొచ్చింది. ఓపెన్‌స్టాక్స్‌, ఓపెన్‌ టెక్స్ట్‌బుక్‌ లైబ్రరీ, ఎస్‌.చాంద్‌ పబ్లిషింగ్‌ సంస్థలకు చెందిన పుస్తకాలు ఇందులో ఉన్నాయి. 

ఈ పుస్తకాల ఆధారంగా విద్యార్థులు తమ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ప్రత్యేకత ఏమిటంటే.. జెమినీ ఇచ్చే సమాధానాలకు పాఠ్యపుస్తకాల్లోని సంబంధిత సమాచారాన్ని ఆధారంగా చూపిస్తుంది. సమాధానాల్లోనే మూల పుస్తకాలకు సంబంధించిన సూచనలు, లింకులు ఉంటాయి. దీంతో ఏ సమాచారం ఏ పుస్తకం నుంచి తీసుకుందో విద్యార్థులు సులభంగా తెలుసుకోవచ్చు.

పుస్తకాల్లోని అంశాలతో వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా స్టడీ గైడ్లు, ప్రాక్టీస్‌ క్విజ్‌లు, ఫ్లాష్‌కార్డులు కూడా రూపొందించుకోవచ్చు. పరీక్షలకు సిద్ధమయ్యే సమయంలో పాఠ్యాంశాలను పునశ్చరణ చేసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. విద్యార్థులు తమకు అర్థంకాని అంశాలపై ప్రశ్నలు అడిగి, పుస్తకంలోని సమాచారం ఆధారంగా వివరణలు పొందవచ్చు.

ఎలా ఉపయోగించుకోవాలంటే..
ముందుగా జెమినీ నోట్‌బుక్‌లోకి వెళ్లి కొత్త నోట్‌బుక్‌ను తెరవాలి. అందులో ‘యాడ్‌ సోర్సెస్‌’ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం ‘టెక్ట్స్‌బుక్స్‌’పై క్లిక్‌ చేస్తే అందుబాటులో ఉన్న పుస్తకాల జాబితా కనిపిస్తుంది. అందులో కావాల్సిన పుస్తకాన్ని ఎంచుకుని నోట్‌బుక్‌కు జత చేసుకోవచ్చు. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవడానికి అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదని గూగుల్‌ తెలిపింది. 

విద్యార్థులు విశ్వసనీయమైన పాఠ్యాంశాల ఆధారంగా ఏఐ సాయంతో నేర్చుకునేలా చేయడమే ఈ నిర్ణయం వెనుక ఉద్దేశమని గూగుల్‌ పేర్కొంది. గత నెల ప్రారంభించిన ‘ఎక్స్‌పర్ట్‌ ఇంటెలిజెన్స్‌’ కార్యక్రమంలో భాగంగా ఈ సదుపాయాన్ని విస్తరిస్తోంది.