రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ 3-పాయింట్ ఫార్ములా.. అవేంటంటే?

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ 3-పాయింట్ ఫార్ములా.. అవేంటంటే?

India 3 point formula for Russia Ukraine war what are they
  • ఇంధన కేంద్రాలపై దాడులు ఆపాలని సూచన
  • ధాన్యం, ఇంధన రవాణా కొనసాగించాలని హితవు
  • వాణిజ్య నౌకలపై దాడులు ఆపాలని ప్రతిపాదన
  • నల్ల సముద్రంలో వాణిజ్యానికి భద్రత కల్పించాలన సూచన
  • 2024లో జైశంకర్ కీవ్ పర్యటనలో ప్రతిపాదన
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఏర్పడుతున్న నష్టాన్ని తగ్గించేందుకు భారత్ కీలక ప్రతిపాదన చేసింది. యుద్ధం వెంటనే పూర్తిగా ఆగకపోయినా.. దాని ప్రభావాన్ని తగ్గించేలా మూడు అంశాలతో కూడిన సంధి ప్రణాళికను సూచించింది. ఇంధన కేంద్రాలపై దాడులు ఆపడం, నల్ల సముద్రం ద్వారా ధాన్యం, ఇంధన రవాణాను కొనసాగించడం, వాణిజ్య నౌకలపై దాడులు నిలిపివేయడం ఇందులో ఉన్నాయి.

భారత్ ప్రతిపాదించిన తొలి అంశం ఇంధన కేంద్రాలు, ఇతర కీలక మౌలిక వసతులపై దాడులు నిలిపివేయడం. విద్యుత్, ఇంధన వ్యవస్థలు దెబ్బతినకుండా చూడటం ద్వారా ప్రజల రోజువారీ జీవితం, ఆర్థిక కార్యకలాపాలపై యుద్ధ ప్రభావాన్ని తగ్గించవచ్చని భారత్ భావిస్తోంది.

రెండో అంశం నల్ల సముద్రం రేవుల నుంచి ధాన్యం, ఇంధనం, సరకుల రవాణా కొనసాగించడం. యుద్ధం కారణంగా కీలక సరఫరా మార్గాలు దెబ్బతినకుండా చూడాలని భారత్ సూచించింది. ఆహారం, ఇంధన సరఫరాలో అంతరాయం రాకుండా ఇది ఉపయోగపడుతుందని భావిస్తోంది.

మూడో అంశం వాణిజ్య నౌకల భద్రత. నల్ల సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు పూర్తిగా ఆపాలని భారత్ ప్రతిపాదించింది. ఇప్పటివరకు జరిగిన చర్చల్లో ధాన్యం రవాణాకు ఎక్కువ ప్రాధాన్యం ఉండగా.. భారత్ మాత్రం అన్ని వాణిజ్య నౌకలకు భద్రత కల్పించే అంశాన్ని ముందుకు తెచ్చింది.

ఇదే భారత ప్రతిపాదనను ప్రత్యేకంగా నిలబెడుతోంది. గతంలో వచ్చిన కొన్ని ప్రతిపాదనలు ధాన్యం రవాణాపైనే దృష్టి పెట్టాయి. అమెరికా ప్రతిపాదన ప్రధానంగా ఇంధన కేంద్రాలపై దాడులు ఆపే అంశానికి పరిమితమైంది. భారత్ మాత్రం ఇంధన వసతులు, సరకుల రవాణా, వాణిజ్య నౌకల భద్రతను ఒకే ప్రణాళికలో చేర్చింది.

విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ 2024 సెప్టెంబరు 3న కీవ్ పర్యటన సందర్భంగా ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చినట్లు సమాచారం. రష్యా-ఉక్రెయిన్ వివాదానికి చర్చలు, దౌత్య మార్గమే పరిష్కారమని భారత్ మొదటి నుంచి చెబుతోంది. యుద్ధం పూర్తిగా ముగిసే వరకు కనీసం కీలక రంగాల్లో దాడులను తగ్గించడం ద్వారా నష్టాన్ని నియంత్రించాలన్నది ఈ ప్రతిపాదన ఉద్దేశం.
Advertisement
India
Russia Ukraine War
Three Point Formula
S Jaishankar
Black Sea Trade
Energy Infrastructure Security

More Telugu News