ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ అస్తమయం
Advertisement

ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ అస్తమయం

Spiritual Guru Kalki Bhagavan passes away
  • చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో అనారోగ్యంతో కన్నుమూత
  • ఏకం క్షేత్రంలో మూడు రోజుల పాటు అంతిమ దర్శనాలు
  • శనివారం ఆలయ ప్రాంగణంలోనే అంత్యక్రియలు
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఒనెనెస్ ఉద్యమ స్థాపకుడైన కల్కి భగవాన్ (77) మహాసమాధి చెందారు. గత పది రోజులుగా చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వయసు సంబంధిత అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఆయన, మంగళవారం మధ్యాహ్నం సుమారు 3 గంటలకు తుదిశ్వాస విడిచారని ట్రస్టు వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ఆయన అసలు పేరు విజయ్ కుమార్ నాయుడు.

ఆయన భౌతికకాయాన్ని బుధవారం ఉదయం 11 గంటలకు తిరుపతి జిల్లా వరదయ్యపాళెం మండలంలోని బత్తులవల్లంలో ఉన్న ఏకం క్షేత్రానికి (గోల్డెన్ సిటీ) తరలించనున్నారు. దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తుల సందర్శనార్థం బుధవారం నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు మూడు రోజుల పాటు ఆయన పార్థివ దేహాన్ని ఉంచుతారు. ఆన్‌లైన్ ద్వారా కూడా దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ట్రస్టు తెలిపింది. అంత్యక్రియలు శనివారం ఆలయ ప్రాంగణంలోనే నిర్వహించనున్నారు. ఇందుకోసం సమాధి నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

ఎల్‌ఐసీ క్లర్క్ నుంచి ఆధ్యాత్మిక గురువుగా..
కల్కి భగవాన్ 1949 మార్చి 7న తమిళనాడులోని వెల్లూరు జిల్లా నాథం గ్రామంలో జన్మించారు. చెన్నైలో చదువు పూర్తి చేసిన తర్వాత, ఆయన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ)లో క్లర్క్‌గా తన వృత్తిని ప్రారంభించారు. 1980ల చివర్లో చిత్తూరు జిల్లాలో 'జీవాశ్రమ్' పేరుతో ఒక పాఠశాలను ప్రారంభించి తన ఆధ్యాత్మిక ప్రస్థానాన్ని మొదలుపెట్టారు.

1990లలో తనను తాను విష్ణుమూర్తి పదో అవతారమైన కల్కిగా ప్రకటించుకుని, 'ఒనెనెస్' ఉద్యమాన్ని స్థాపించారు. దీనికి తర్వాత 'ఏకం' అని పేరు మార్చారు. ధ్యానం, ముక్తి దీక్ష (ఒనెనెస్ బ్లెస్సింగ్) వంటి కార్యక్రమాల ద్వారా ఆయన లక్షలాది మంది అనుచరులను, ముఖ్యంగా విదేశీయులను ఆకర్షించారు. వరదయ్యపాళెంలో సుమారు రూ.200 కోట్ల వ్యయంతో పాలరాతితో నిర్మించిన గోల్డెన్ సిటీ (ఏకం ఆలయం) ఆయన కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా మారింది.

2017లో ఆయన తన సంస్థల బాధ్యతలను కుమారుడు ఎన్‌కేవీ కృష్ణ, కోడలు ప్రీతా కృష్ణలకు అప్పగించారు. కల్కి భగవాన్ మరణ వార్త తెలియగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన భక్తులు తీవ్ర శోకంలో మునిగిపోయారు. భక్తులు శాంతియుతంగా దర్శనం చేసుకోవాలని, వసతి ఏర్పాట్లు ఎవరికి వారు చూసుకోవాలని ట్రస్టు విజ్ఞప్తి చేసింది.
Advertisement
Kalki Bhagavan
Oneness Movement
Vijay Kumar Naidu
Ekam Golden City Tirupati
Spiritual Guru passes away
Varadaiahpalem Chittoor

More Telugu News