కర్నూలులో ఏవియేషన్ అకాడమీ రావడం చరిత్రాత్మకం: బీసీ జనార్దన్ రెడ్డి
- ఏవియేషన్ సెంటర్ ను ప్రారంభించిన ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీ
- పైలట్లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతుందన్న మంత్రి
- ఓర్వకల్లులో డ్రోన్ సిటీ ఏర్పాటు చేయబోతున్నట్టు బీసీ జనార్దన్ ప్రకటన
రాష్ట్రంలోనే ప్రప్రథమంగా కర్నూలు ఎయిర్‌పోర్టులో ఏవియేషన్ ట్రైనింగ్ సెంటర్ అందుబాటులోకి రావడం చరిత్రాత్మకమని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కర్నూలు విమానాశ్రయం వేదికగా ఈరోజు 'ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీ' ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా కలెక్టర్ సిరి, స్థానిక ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, కేఈ శ్యామ్ బాబుతో పాటు అకాడమీ చైర్మన్ ఆనంద్ జాకబ్ వర్గీస్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా భవిష్యత్ ప్రణాళికలపై మాట్లాడిన మంత్రి జనార్దన్ రెడ్డి... ఓర్వకల్లులో అత్యాధునిక హంగులతో 'డ్రోన్ సిటీ'ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. దీన్ని రెండు దశలుగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. తొలి విడతలో 180 ఎకరాల్లో, ఆ తర్వాత రెండో దశలో మరో 400 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.
గతంలో 2017లో కర్నూలు ఎయిర్‌పోర్టు నిర్మాణానికి పునాదిరాయి వేసి, అతి తక్కువ కాలంలోనే దానిని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశామని జనార్దన్ రెడ్డి గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో ఏవియేషన్ సెక్టార్‌లో ప్రొఫెషనల్స్, పైలట్లకు డిమాండ్ విపరీతంగా పెరగనుందని తెలిపారు. ఈ కొత్త ట్రైనింగ్ సెంటర్ ద్వారా కర్నూలు జిల్లా యువతతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు విమానయాన రంగంలో నిపుణులుగా శిక్షణ పొందే సువర్ణావకాశం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.