రూ.500 కోట్ల ఆస్తి.. చేతికి మాత్రం ఫేక్‌ రోలెక్స్‌ వాచ్‌.. కారణం తెలిస్తే షాక్‌!

500 crore net worth but wears a fake Rolex watch the reason will shock you
  • ఢిల్లీ వ్యాపారవేత్త ఆసక్తికర నిర్ణయం
  • రూ.25 లక్షల బదులు రూ.10 వేల ఫస్ట్ కాపీ రోలెక్స్
  • ‘ఎవరూ అసలైనదేనా అని అడగరు’ అని వెల్లడి
  • సమయం చూపడమే లక్ష్యం.. లక్షలు ఎందుకని వ్యాఖ్య
  • లింక్డిన్‌లో పంచుకున్న పారిశ్రామికవేత్త రోహన్ ధావన్
  • విలాస వస్తువుల అసలు విలువపై నెట్టింట్లో చర్చ
డబ్బుంటే ఖరీదైన వస్తువులే వాడతారని చాలామంది అనుకుంటారు. కానీ రూ.500 కోట్ల ఆస్తి ఉన్న ఓ వ్యాపారవేత్త మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఆలోచించాడు. రూ.25 లక్షలకు పైగా విలువ చేసే రోలెక్స్ వాచ్‌కు బదులు రూ.10 వేల ఫస్ట్ కాపీనే కొనుగోలు చేశాడు. అందుకు ఆయన చెప్పిన కారణం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది.

ఢిల్లీకి చెందిన పారిశ్రామికవేత్త రోహన్ ధావన్ ఈ విషయాన్ని లింక్డిన్‌లో పంచుకున్నారు. ఇటీవల ఓ వ్యాపారవేత్తను కలిసినప్పుడు ఆయన చేతికి ఉన్న టూ-టోన్ రోలెక్స్ డేటోనా వాచ్‌ను చూసి ప్రశంసించానని తెలిపారు. అయితే అది అసలైన రోలెక్స్ కాదని, ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా రూ.10 వేలకే కొనుగోలు చేసిన ఫస్ట్ కాపీ అని ఆ వ్యాపారవేత్త చెప్పడంతో ఆశ్చర్యపోయినట్లు వెల్లడించారు.

ఆ వ్యాపారవేత్త ఆస్తి విలువ దాదాపు రూ.500 కోట్లు ఉంటుందని రోహన్ పేర్కొన్నారు. తనను తెలిసిన వాళ్లు అది అసలైన వాచేనా? అని ఎప్పుడూ అడగరని, తన స్థాయిని చూసి నిజమైనదేనని భావిస్తారని వ్యాపారవేత్త చెప్పినట్లు వివరించారు. సమయం ఒకేలా చూపుతుంది.. చూసేవాళ్లు ఒకేలా మెచ్చుకుంటారు.. అలాంటప్పుడు రూ.లక్షలు ఎందుకు ఖర్చు చేయాలని ప్రశ్నించినట్లు తెలిపారు.

ఈ మాటలు తనను ఆలోచింపజేశాయని రోహన్ చెప్పారు. తాను మాత్రం తక్కువ వస్తువులైనా అసలైనవే కొనడాన్ని ఇష్టపడతానని వెల్లడించారు. అయినా ఆ వ్యాపారవేత్త చెప్పిన వాదనను పూర్తిగా తప్పుపట్టలేకపోయానని పేర్కొన్నారు.

ఈ పోస్టు వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. విలాసవంతమైన బ్రాండ్ల అసలు విలువ వాటి నాణ్యతలో ఉందా? లేక సమాజంలో కలిగించే గుర్తింపులో ఉందా? అనే అంశంపై చర్చ కొనసాగుతోంది.
Advertisement
Rohan Dhawan
Fake Rolex watch
500 crore businessman
First copy watches
Luxury brand status
LinkedIn viral post

More Telugu News