వింత ట్రాఫిక్‌ రూల్స్‌.. కొన్ని దేశాల్లో ఈ చిన్న తప్పు చేసినా భారీ జరిమానా!

Strange Traffic Rules Heavy Fines For Small Mistakes In Some Countries
  • దేశానికో ప్రత్యేక ట్రాఫిక్‌ నిబంధన
  • పాదచారిపై నీరు పడితే జపాన్‌లో జరిమానా
  • ఇంధనం అయిపోతే జర్మనీలో ఫైన్‌
  • డ్రైవ్‌ చేస్తూ కాఫీ తాగితే సైప్రస్‌లో చర్యలు
  • సేఫ్టీ జాకెట్‌ లేకపోతే ఫ్రాన్స్‌లో జరిమానా
  • చెప్పులు, దుస్తులపైనా కొన్ని దేశాల్లో ప్రత్యేక రూల్స్‌
విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి ట్రాఫిక్‌ నిబంధనలు తెలుసుకోవడం ఎంత ముఖ్యమో చాలామంది గుర్తించరు. మనకు సాధారణంగా అనిపించే కొన్ని అలవాట్లు.. కొన్ని దేశాల్లో మాత్రం చట్టవిరుద్ధం. వర్షపు నీరు పాదచారిపై చిందిపడినా, కారులో సేఫ్టీ జాకెట్‌ లేకపోయినా జరిమానా తప్పదు. అందుకే ప్రయాణానికి ముందు ఆయా దేశాల ప్రత్యేక ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన ఉండటం అవసరం. పర్యాటకులు ఎక్కువగా ఇబ్బందులు పడే కొన్ని విచిత్రమైన ట్రాఫిక్‌ రూల్స్‌ ఇవే.

వర్షపు నీరు చిందిపడితే..
భారీ వర్షాల తర్వాత రోడ్డుపై నీరు నిల్వ ఉండటం సహజం. కానీ జపాన్‌లో ఆ నీరు పాదచారులపై పడేలా కారు నడిపితే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నీళ్లు నిలిచిన చోట వేగం తగ్గించి వెళ్లాలని అక్కడి నిబంధనలు చెబుతున్నాయి. పాదచారికి అసౌకర్యం కలిగితే డ్రైవర్‌కు జరిమానా విధిస్తారు. బ్రిటన్‌లోనూ ఇదే తరహా నిబంధన అమల్లో ఉంది.

పెట్రోల్‌ అయిపోతే
జర్మనీ ఆటోబాన్‌ రహదారులపై కొన్ని ప్రాంతాల్లో వేగంపై పరిమితి ఉండదు. అలాంటి రోడ్డుపై ఇంధనం అయిపోయి వాహనం ఆగిపోతే అది డ్రైవర్‌ నిర్లక్ష్యంగా పరిగణిస్తారు. దీంతో ప్రమాదకర పరిస్థితి ఏర్పడిందనే కారణంతో జరిమానా విధిస్తారు. ప్రయాణానికి ముందు ఇంధనం సరిపోతుందో లేదో చూసుకోవడం అక్కడ తప్పనిసరి.

డ్రైవింగ్‌ చేస్తూ కాఫీ..
కారు నడుపుతూ కాఫీ తాగడం లేదా శాండ్‌విచ్‌ తినడం చాలామందికి అలవాటే. కానీ సైప్రస్‌లో అలాంటి పని జరిమానాకు దారితీయొచ్చు. డ్రైవింగ్‌పై పూర్తి దృష్టి ఉండాలన్నదే అక్కడి చట్టం ఉద్దేశం. 

కారులో సేఫ్టీ జాకెట్‌
ఫ్రాన్స్‌లో ప్రతి కారులో రిఫ్లెక్టివ్‌ సేఫ్టీ జాకెట్‌ తప్పనిసరిగా ఉండాలి. వాహనం చెడిపోయి రోడ్డుపై దిగాల్సి వస్తే ముందుగా ఆ జాకెట్‌ ధరించాలి. కారులో అది లేకపోయినా, అత్యవసర సమయంలో ధరించకపోయినా జరిమానా తప్పదు. 

కారు డోర్‌ను గట్టిగా మూసినా
స్విట్జర్లాండ్‌లో ప్రశాంత వాతావరణానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో అవసరం లేకుండా శబ్దం చేయడం అక్కడి ప్రజలు సహించరు. కొన్ని ప్రాంతాల్లో పదేపదే కారు డోర్‌ను బలంగా మూస్తే స్థానిక నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

చెప్పులు కూడా ముఖ్యం
బీచ్‌ నుంచి నేరుగా కారులో బయల్దేరేవారు స్పెయిన్‌లో జాగ్రత్తగా ఉండాలి. తడిసిన, ఇసుక అంటిన చెప్పులు డ్రైవింగ్ కు ఆటంకంగా ఉన్నాయని పోలీసులు భావిస్తే జరిమానా విధించవచ్చు. స్లిప్పర్లు, హైహీల్స్‌పై ప్రత్యేక నిషేధం లేకపోయినా, భద్రతకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు.

షర్ట్‌ లేకుండా డ్రైవింగ్‌ చేస్తే
వేడి ఎక్కువగా ఉండే థాయ్‌లాండ్‌లో షర్ట్‌ లేకుండా వాహనం నడపడం అనుమతించరు. ముఖ్యంగా బీచ్‌ ప్రాంతాల్లో స్కూటర్‌ నడిపే పర్యాటకులపై పోలీసులు ప్రత్యేకంగా నిఘా ఉంచుతారు. తగిన దుస్తులు ధరించకుండా డ్రైవింగ్‌ చేస్తే జరిమానా విధిస్తారు.
Advertisement
Traffic Rules
Strange Traffic Laws
International Driving Fines
Japan Traffic Rules
Germany Autobahn Laws
Global Driving Regulations

More Telugu News