ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు అద్నాన్ సామీ ఇటీవల తన కుటుంబ సభ్యులతో కలిసి ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను సందర్శించారు. తన భార్య రోయా సామీ ఖాన్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటోలను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రాలు నెట్టింట వైరల్‌గా మారాయి.

తాజ్‌మహల్ ముందు తన భార్యతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేస్తూ అద్నాన్ సామీ భావోద్వేగానికి లోనయ్యాడు. "ఈ వారం ఆగ్రా వెళ్లాను. ప్రేమకు అద్భుతమైన ప్రతీక అయిన తాజ్‌మహల్‌ను ఎన్నిసార్లు సందర్శించినా, అది ఎప్పుడూ నూతనంగా, అద్భుతంగానే కనిపిస్తుంది. ముఖ్యంగా నా ప్రియమైన కుటుంబ సభ్యుల ప్రేమ మధ్యలో ఉన్నప్పుడు ఆ అనుభూతి మరింత ప్రత్యేకం" అని ఆయన పేర్కొన్నాడు.

ఈ ఫోటోల్లో అద్నాన్ సామీ రూపం గుర్తుపట్టలేనంతగా మారిపోవడం మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. ఒకప్పుడు 230 కిలోల బరువున్న ఆయన, కఠినమైన ఆహార నియమాలు, క్రమం తప్పని వ్యాయామంతో దాదాపు 120 నుంచి 130 కిలోల బరువు తగ్గాడు. అయితే, తాను బరువు తగ్గడానికి ఎలాంటి శస్త్రచికిత్సలు చేయించుకోలేదని ఆయన గతంలోనే స్పష్టం చేశాడు.

'లిఫ్ట్ కరా దే', 'కభీ తో నజర్ మిలావో' వంటి పాపులర్ ఆల్బమ్‌లతో పాటు, 'మెహబూబా మెహబూబా', 'భర్ దో జోలీ మేరీ' వంటి ఎన్నో సూపర్ హిట్ బాలీవుడ్ గీతాలతో అద్నాన్ సామీ సంగీత ప్రియులను అలరించాడు.