పంచ్‌కులాలోని ఓ పాఠశాలలో అత్యంత దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. మూడో తరగతి చదువుతున్న ఓ బాలుడు, ప్రత్యేక అవసరాలున్న కిండర్ గార్టెన్ (కేజీ) విద్యార్థినిపై రాళ్లు, పూలకుండీతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన పంచ్‌కులా సెక్టార్ 20లోని సంస్కృతి మోడల్ స్కూల్‌లో జరిగింది.

మూడో తరగతి చదువుతున్న బాలుడు.. చిన్నారిపై మొదట రాళ్లతో పదేపదే దాడి చేశాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న పూల కుండీతో బలంగా కొట్టాడు. ఈ దాడిలో బాలిక స్పృహ కోల్పోయినా కూడా ఆ బాలుడు దాడి ఆపలేదని, స్పృహతప్పిన చిన్నారిని కొంత దూరం లాక్కెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనతో బాలిక పరిస్థితి విషమంగా మారింది.

వెంటనే పాఠశాల సిబ్బంది చిన్నారిని పంచ్‌కులా సెక్టార్ 6లోని సివిల్ ఆసుపత్రికి తరలించారు. అయితే, పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం చండీగఢ్‌లోని పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్‌)కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు పాఠశాలకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. దాడికి పాల్పడిన బాలుడి తల్లిదండ్రులను, పాఠశాల యాజమాన్యాన్ని విచారిస్తున్నారు. ఈ సంఘటన పాఠశాల ప్రాంగణంలో విద్యార్థుల భద్రత, పర్యవేక్షణపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది.