అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌పై మరోసారి భారీ సైనిక చర్యకు దిగే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. నవంబర్‌ 3న జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ ఘోర పరాజయం ఎదుర్కొంటే, ట్రంప్‌ మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉందని ఓ అమెరికా అధికారి వెల్లడించినట్లు ఆక్సియోస్‌ కథనాన్ని ఉటంకిస్తూ న్యూస్‌18 పేర్కొంది. అయితే ఎన్నికల ఫలితాలు ఇరాన్‌పై నిర్ణయాలను ప్రభావితం చేయవని వైట్‌హౌస్‌ అధికారి ఈ వాదనను తోసిపుచ్చారు. 

రిపబ్లికన్లు ఎన్నికల్లో భారీగా నష్టపోతే ట్రంప్‌ తన రాజకీయ ప్రతిష్ఠకు భంగం కలిగిందని భావించి ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవచ్చని ఓ అమెరికా అధికారి చెప్పినట్లు నివేదిక తెలిపింది. ఈ సందేశాన్ని ఇరాన్‌ అధికారులకు కూడా చేరవేస్తున్నారని పేర్కొంది. ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇదే సరైన సమయమని వారికి చెబుతున్నట్లు వివరించింది.

మరోవైపు, అమెరికా-ఇరాన్‌ మధ్య చర్చలను తిరిగి ప్రారంభించేందుకు ఖతార్‌ మధ్యవర్తులు ప్రయత్నిస్తున్నారు. శుక్రవారం టెహ్రాన్‌లో 12 గంటలకు పైగా చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ చర్చల్లో కొంత సానుకూల పురోగతి కనిపించిందని ఓ దౌత్యవేత్త పేర్కొన్నారు. శనివారం దోహాలోనూ చర్చలు కొనసాగనున్నాయి. అణు కార్యక్రమంపై రాయితీలు ఇవ్వాలని అమెరికా కోరుతుండగా.. ముందుగా నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని, నిలిపివేసిన నిధులను విడుదల చేయాలని, చమురు విక్రయాలకు అనుమతించాలని ఇరాన్‌ డిమాండ్‌ చేస్తోంది. 

ట్రంప్‌ ఆదేశిస్తే 96 గంటల్లోనే ఇరాన్‌పై కొత్త సైనిక చర్యలు ప్రారంభించేందుకు అమెరికా బలగాలు సిద్ధంగా ఉన్నాయని ఇటీవల సీఎన్‌ఎన్‌ కథనం వెల్లడించింది. ఇరాన్‌లోని ఇంధన వనరులు, సైనిక స్థావరాలు, అణు కేంద్రాలు లక్ష్యంగా దాడులు జరిగే అవకాశం ఉందని అమెరికా అధికారులను ఉటంకించింది. అయితే తుది నిర్ణయం ట్రంప్‌ తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేసింది. 

అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే దాడులకు సంబంధించి ట్రంప్‌ నుంచి ఇప్పటివరకు తుది ఆదేశాలు వెలువడలేదు.