Bhanu Chander Reddy: తెలంగాణ టెక్కీ ఆత్మహత్యకు అసలు కారణం ఇదే!

AI Job Loss and Family Issues Led to Bhanu Chander Reddy Suicide
షార్ట్స్‌లో చూడండి
కన్నతల్లి మాట కరువైంది... ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు అమ్మానాన్నలు దూరమయ్యారు... దీనికి తోడు లక్షల జీతం ఇచ్చే కొలువు ఊడింది... వెరసి ఆ యువ ఇంజనీర్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. బతుకుపై ఆశలు కోల్పోయి ఉరేసుకుని తనువు చాలించాడు. కళ్లెదుటే భర్త విగతజీవిగా మారడాన్ని ఆ ఇల్లాలు జీర్ణించుకోలేకపోయింది. భవనంపై నుంచి కిందికి దూకి ప్రాణాలు తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తెచ్చిన ఉద్యోగ గండం, దానికి తోడైన కుటుంబ కలహం ఓ ప్రేమ జంటను బలి తీసుకున్న ఈ విషాద ఘటన బెంగళూరులో తీవ్ర కలకలం రేపింది.

తెలంగాణలోని గజ్వేల్‌కు చెందిన భానుచందర్‌రెడ్డి, షాజియా సిరాజ్ చిన్ననాటి స్నేహితులు. వారి స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరూ ఉన్నత చదువులు చదివి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా స్థిరపడ్డారు. మతాలు వేరైనా, మనసులు కలిసిన ఆ జంట పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంది. అయితే, ఈ వివాహం ఇరు కుటుంబాల్లో తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. ముఖ్యంగా, కొడుకు మతాంతర వివాహం చేసుకోవడాన్ని భానుచందర్ తల్లి జీర్ణించుకోలేకపోయింది. అప్పటి నుంచి అతడితో మాట్లాడటం మానేసింది.

మరోవైపు, భానుచందర్ కెరీర్ ఉన్నత స్థాయిలో ఉండేది. అమెరికాలో ఏటా రూ.80 లక్షల ప్యాకేజీతో పనిచేసేవారు. అయితే, ఇటీవల టెక్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఏఐ రాకతో ఉద్యోగాల కోతలో భాగంగా ఆయన తన ఉద్యోగాన్ని కోల్పోయారు. అమెరికా, కెనడాల్లో మరో ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో దంపతులిద్దరూ భారత్‌కు తిరిగి వచ్చి బెంగళూరులో స్థిరపడ్డారు.

ఉద్యోగం పోవడం ఒకెత్తయితే, ప్రేమ వివాహం చేసుకున్నందుకు తల్లి తనతో మాట్లాడకపోవడం భానుచందర్‌ను మానసికంగా కుంగదీసింది. తీవ్రమైన ఒంటరితనం, భవిష్యత్తుపై అభద్రతాభావం అతడిని ఆవరించాయి. ఈ క్రమంలోనే, క్షణికావేశంలో ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భర్త ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానంతో తలుపులు పగలగొట్టి చూసిన షాజియాకు, విగతజీవిగా వేలాడుతున్న భర్త కనిపించాడు. ఆ దృశ్యాన్ని చూసి తట్టుకోలేకపోయిన ఆమె, అదే భవనంలోని 17వ అంతస్తుపైకి వెళ్లి కిందికి దూకి ప్రాణాలు విడిచింది.

చావులోనైనా వారిని కలవనీయండి
పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను తరలించే సమయంలో బంధువుల మధ్య మరోసారి వాగ్వాదం చోటుచేసుకుంది. మతాల కారణంగా వారిని వేర్వేరు అంబులెన్స్‌లలో తరలించాలని పట్టుబట్టారు. ఆ సమయంలో అక్కడున్న స్థానికులు, స్నేహితులు కల్పించుకుని "బతికుండగా వారిని కలవనివ్వలేదు, కనీసం చావులోనైనా వాళ్లను కలిసుండనీయండి" అని కన్నీళ్లతో వేడుకోవడంతో బంధువులు అంగీకరించారు. ఒకే అంబులెన్స్‌లో వారి పార్థివదేహాలను స్వస్థలాలకు తరలిస్తుండగా అక్కడున్న వారి కళ్లు చెమర్చాయి. ప్రేమ, ఉద్యోగ భద్రత, సామాజిక ఆమోదం... ఈ మూడింటి మధ్య నలిగిపోయి రెండు నిండు ప్రాణాలు అర్ధాంతరంగా ముగిసిపోవడం అందరినీ కలచివేసింది.
Go Back to Shorts
Bhanu Chander Reddy
Telangana
Bangalore
AI layoffs
Artificial Intelligence
Love marriage
Software engineer
Job loss
Family issues
Suicide

More Telugu News