కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లలో వాట్సాప్ వెబ్ వినియోగించే యూజర్లకు కేంద్ర హోంశాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. సిస్టమ్‌లలో వాట్సాప్ వెబ్ లాగిన్ అయి అలాగే వదిలేయడం వల్ల యూజర్ల ఖాతాలను సైబర్ నేరగాళ్లు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకునే ముప్పు ఉందని స్పష్టం చేసింది.

కేంద్ర హోంశాఖ పరిధిలోని 'ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్' (I4C) కు చెందిన 'నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్' (NCTAU) ఈ భద్రతా హెచ్చరికను విడుదల చేసింది. ముఖ్యంగా ఆఫీసులు లేదా ఇతరులు సులభంగా యాక్సెస్ చేయగల ఉమ్మడి కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్ సెషన్లు యాక్టివ్‌గా ఉండిపోవడం వల్ల సైబర్ మోసాలకు ఆస్కారం ఏర్పడుతోందని అధికారులు వివరించారు.

పొంచి ఉన్న ముప్పు ఇదే..
చాలామంది యూజర్లు పని ముగిసిన తర్వాత కేవలం బ్రౌజర్ ట్యాబ్‌ను మూసివేస్తుంటారు. అయితే, బ్రౌజర్ ట్యాబ్ క్లోజ్ చేసినంత మాత్రాన వాట్సాప్ వెబ్ సెషన్ లాగౌట్ కాదు. దీంతో అదే సిస్టమ్‌ను ఉపయోగించే మూడో వ్యక్తి మీ ప్రమేయం లేకుండానే మీ వ్యక్తిగత చాటింగ్‌లు చదివే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీ ఖాతా ద్వారా ఇతరులకు మెసేజ్‌లు పంపడం, కాంటాక్ట్ వివరాలు మరియు గ్రూప్ చాట్‌లను చూడటం చేయవచ్చు. ఈ యాక్సెస్‌ను ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు ఫిషింగ్, ఆర్థిక మోసాలు, సోషల్ ఇంజనీరింగ్ నేరాలకు పాల్పడే ప్రమాదం పొంచి ఉందని సైబర్ విభాగం వెల్లడించింది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
తప్పనిసరిగా లాగౌట్: కంప్యూటర్‌లో పని పూర్తయిన ప్రతిసారీ వాట్సాప్ మెనూలోకి వెళ్లి 'లాగౌట్' (Log out) చేయాలి.
ఉమ్మడి సిస్టమ్‌లలో వాడొద్దు: కార్యాలయాల్లోని పీసీలు, సైబర్ కేఫ్‌లు, హోటల్ బిజినెస్ సెంటర్లు, లేదా ఇతరులు ఉపయోగించే పబ్లిక్ కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్ అస్సలు వాడకూడదు.
శాశ్వత లాగిన్ వద్దు: సిస్టమ్‌లలో వాట్సాప్‌ను ఎప్పటికీ లాగిన్ చేసి వదిలేయకూడదు.
ప్రైవేట్ మోడ్ శాశ్వత పరిష్కారం కాదు: అత్యవసర పరిస్థితుల్లో వాడాల్సి వస్తే, కేవలం నమ్మకమైన కంప్యూటర్లలో మాత్రమే ఇంకాగ్నిటో (Incognito) లేదా ప్రైవేట్ మోడ్‌ను ఎంచుకోవాలి. అయితే ఇది కేవలం అదనపు జాగ్రత్త మాత్రమే తప్ప పూర్తి పరిష్కారం కాదని గుర్తుంచుకోవాలి.
అనుమానాస్పద మెసేజ్‌లపై నిఘా: మీరు పంపని మెసేజ్‌లు ఖాతాలో కనిపించినా, లేదా మీ కాంటాక్ట్‌ల నుంచి వింత సమాధానాలు వచ్చినా ఖాతా భద్రతపై వెంటనే అప్రమత్తం కావాలి.
సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు: కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ (OS), బ్రౌజర్, యాంటీవైరస్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి. గుర్తుతెలియని లింకులు, పైరేటెడ్ లేదా క్రాక్డ్ సాఫ్ట్‌వేర్‌లను డౌన్‌లోడ్ చేయకూడదు.
రహస్య సమాచారం వద్దు: సున్నితమైన, ఆర్థికపరమైన లేదా అత్యంత రహస్య సమాచారాన్ని వాట్సాప్‌లో పంచుకోకపోవడం ఉత్తమం.

ముఖ్యంగా సున్నితమైన డేటాను నిర్వహించే ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు తమ అధికారిక కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్ వాడకాన్ని పూర్తిగా నియంత్రించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా వ్యక్తిగత గోప్యతతో పాటు భద్రతకు తీవ్ర విఘాతం కలిగే అవకాశం ఉందని హెచ్చరించారు.