ఆన్‌లైన్ బ్యాంకింగ్, డిజిటల్ లావాదేవీల్లో పెరుగుతున్న మోసాలను అరికట్టేందుకు, ఖాతాదారుల ప్రయోజనాలకు మరింత పటిష్ఠ రక్షణ కల్పించేందుకు భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ మోసాల బారిన పడకుండా ఖాతాదారులే స్వయంగా తమ ఖాతా నుంచి నిధుల బదిలీని తక్షణమే నిలిపివేసేలా ‘స్టాప్ స్విచ్’ (Stop Switch) సదుపాయాన్ని బ్యాంకులు తప్పనిసరిగా అందించాలని ఆర్‌బీఐ ప్రతిపాదించింది.

‘కస్టమర్ ప్రొటెక్షన్ ఇన్ ఫ్రాడ్యులెంట్ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్’ సవరించిన నిబంధనల ముసాయిదాలో భాగంగా ఈ కీలక మార్పులను తీసుకొచ్చారు. అనధికార లావాదేవీలు జరిగినప్పుడు ఖాతాదారుల బాధ్యతను పరిమితం చేయడమే కాకుండా, అసలు మోసాలు జరగకుండా ముందస్తు రక్షణ చర్యలు కల్పించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థపై వినియోగదారులకు మరింత నియంత్రణ కల్పించేందుకు ఈ ప్రతిపాదనలు ఉపయోగపడతాయని ఆర్‌బీఐ పేర్కొంది.

స్టాప్ స్విచ్ ఎలా పనిచేస్తుంది?
ఖాతాదారుడు సైబర్ మోసానికి గురవుతున్నట్లు గుర్తించిన వెంటనే ఈ ‘స్టాప్ స్విచ్’ ఫీచర్‌ను ఆన్ చేసుకోవచ్చు. ఇది యాక్టివేట్ కాగానే సదరు ఖాతా నుంచి భవిష్యత్తులో బయటకు వెళ్లాల్సిన అన్ని రకాల డెబిట్ లావాదేవీలు తక్షణమే నిలిచిపోతాయి. అయితే, ఇప్పటికే ఇచ్చిన రికరింగ్ పేమెంట్స్, స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్స్, లోన్ ఈఎంఐలు, బ్యాంకు ఛార్జీల వసూళ్లు వంటి వాటికి మాత్రం ఈ స్టాప్ స్విచ్ నుంచి మినహాయింపు ఉంటుంది.

బ్యాంకుల నిర్లక్ష్యానికి స్పష్టమైన నిర్వచనం
మోసాల సమయంలో బ్యాంకుల బాధ్యతను మరింత పారదర్శకంగా మార్చేందుకు ‘బ్యాంకు నిర్లక్ష్యం’ (Negligence by a bank) అనే అంశానికి ఆర్‌బీఐ సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చింది. బ్యాంకింగ్ వ్యవస్థల్లో తలెత్తే సాంకేతిక లోపాలు, సైబర్ సెక్యూరిటీ వైఫల్యాలు, బ్యాంకు సిబ్బంది లేదా థర్డ్ పార్టీ వ్యక్తుల కుమ్మక్కు వల్ల జరిగే మోసాలను కూడా 'బ్యాంకు నిర్లక్ష్యం' కిందకే పరిగణిస్తారు. ఖాతాలో అనధికార లావాదేవీ జరగడానికి బ్యాంక్ వైపు నుంచి జరిగే ఎలాంటి లోపమైనా ఈ పరిధిలోకి వస్తుంది.

‘ట్రస్టెడ్ పర్సన్’తో అదనపు రక్షణ
ఆర్‌బీఐ (కమర్షియల్ బ్యాంక్స్ - రెస్పాన్సిబుల్ బిజినెస్ కండక్ట్) ఐదో సవరణ నిబంధనలు 2026 ముసాయిదా ప్రకారం, బ్యాంకులు ‘ట్రస్టెడ్ పర్సన్ మెకానిజం’ (TPM)ను కూడా అమలు చేయాల్సి ఉంటుంది. దీని ప్రకారం ఖాతాదారులు తాము నిర్దేశించుకున్న ఒక నిర్దిష్ట పరిమితి కంటే ఎక్కువ మొత్తంలో లావాదేవీ జరిపినప్పుడు, ఆ లావాదేవీని ధ్రువీకరించేందుకు తమకు నమ్మకమైన ఒక వ్యక్తిని (ట్రస్టెడ్ పర్సన్) నామినేట్ చేయవచ్చు.

ఖాతాదారుడు నిర్దేశించిన పరిమితి దాటి లావాదేవీ ప్రారంభించగానే, ఆ ట్రస్టెడ్ పర్సన్‌కు బ్యాంకు సమాచారం పంపుతుంది. ఆ నోటిఫికేషన్‌లో బదిలీ చేయదలచిన మొత్తం, లబ్ధిదారుని పేరు, ఖాతా నంబరు, మొబైల్ నంబరు వంటి వివరాలు ఉంటాయి. ఆ సమాచారం అందినప్పటి నుంచి ట్రస్టెడ్ పర్సన్‌కు ఆమోదం తెలిపేందుకు ఒక గంట సమయం ఉంటుంది. వారు ఆమోదిస్తేనే లావాదేవీ పూర్తవుతుంది. ఒకవేళ ట్రస్టెడ్ పర్సన్ తిరస్కరించినా, లేదా గంటలోపు ఎలాంటి స్పందన తెలియజేయకపోయినా ఆ లావాదేవీ ఆటోమేటిక్‌గా రద్దవుతుంది.

ఈ విధానం పూర్తిగా ఖాతాదారుల ఆప్షనల్ మాత్రమే. ట్రస్టెడ్ పర్సన్‌గా ఎంపికైన వ్యక్తికి సదరు ఖాతాపై ఎలాంటి నియంత్రణ ఉండదు, అలాగే లావాదేవీలకు సంబంధించి వారు ఎలాంటి చట్టపరమైన బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. యూపీఐ పేమెంట్లు, మర్చంట్ లావాదేవీలు, స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ లేదా నాచ్ (NACH) వంటి ముందస్తు అనుమతి పొందిన రికరింగ్ లావాదేవీలకు ఈ విధానం వర్తించదు.

ఈ ముసాయిదా మార్గదర్శకాలు 2027 జులై 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. అయితే, బ్యాంకులు సిద్ధంగా ఉంటే అంతకంటే ముందే వీటిని అమలు చేసుకునే వెసులుబాటును ఆర్‌బీఐ కల్పించింది.