కృత్రిమ మేధ (ఏఐ) సృష్టిస్తున్న సంపద సిలికాన్ వ్యాలీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రికార్డులను తిరగరాస్తోంది. ప్రముఖ ఏఐ మోడల్ 'క్లాడ్' మాతృసంస్థ ఆంథ్రోపిక్‌ పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) ద్వారా ఏకంగా 4,250 మంది ఉద్యోగులు రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారిపోయారు. కంపెనీలో పనిచేస్తున్న సుమారు 70 శాతం మంది సిబ్బంది ఒక్క దెబ్బతో కోట్ల రూపాయల సంపదకు అధిపతులయ్యారు. నాస్‌డాక్‌లో లిస్టింగ్‌కు సిద్ధమైన ఈ సంస్థ ఒక్కో షేరు ధరను అంచనాలకు మించి 83 డాలర్లు (సుమారు రూ.7,745)గా నిర్ణయించింది.

సంస్థలోని మొత్తం 5,300 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. దాదాపు 80 శాతం మంది, అంటే సుమారు 4,250 మంది ఉద్యోగుల వద్ద ఉన్న స్టాక్ ఆప్షన్ల విలువ ఈ ఐపీఓతో కనీసం 1 మిలియన్ డాలర్లు (రూ.9.3 కోట్లు) దాటింది. వీరిలో దాదాపు 1,200 మందికి పైగా ఉద్యోగుల సంపద 10 మిలియన్ డాలర్లు (రూ.93 కోట్లు) దాటింది. తొలినాళ్లలో చేరిన 50 మంది ఉద్యోగుల ఈక్విటీ విలువ 100 మిలియన్ డాలర్ల (సుమారు రూ.930 కోట్లు) మార్కును అధిగమించింది.

సంస్థ ఏడుగురు సహ వ్యవస్థాపకులు తమ వాటాల నుంచి 3.38 మిలియన్ల చొప్పున షేర్లను విక్రయించారు. దీంతో ఒక్కొక్కరి ఖాతాలోకి దాదాపు రూ.2,600 కోట్లు (280 మిలియన్ డాలర్లు) చొప్పున చేరాయి. ఏడుగురు వ్యవస్థాపకులకు కలిపి మొత్తం రూ.18,300 కోట్లకు (1.96 బిలియన్ డాలర్లు) పైగా సమకూరింది. మరోవైపు కంపెనీ మొత్తం 980 మిలియన్ షేర్లను విక్రయించి ఏకంగా రూ.7.6 లక్షల కోట్లు (81.3 బిలియన్ డాలర్లు) సమీకరించింది. గతంలో ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ నమోదు చేసిన రూ.7.02 లక్షల కోట్ల (75 బిలియన్ డాలర్లు) ఐపీవో రికార్డును ఆంథ్రోపిక్‌ తుడిచిపెట్టేసింది.

ఈ మెగా ఇష్యూతో ఆంథ్రోపిక్‌ మొత్తం మార్కెట్ విలువ ఊహకందని రీతిలో రూ.140 లక్షల కోట్లకు (1.5 ట్రిలియన్ డాలర్లు) చేరుకుంది. ఓపెన్ ఏఐ నుంచి బయటకు వచ్చిన పరిశోధకులు కేవలం ఆరేళ్ల క్రితం స్థాపించిన ఒక స్టార్టప్, ఇంత భారీ స్థాయిలో ఉద్యోగులను కుబేరులుగా తీర్చిదిద్దడం టెక్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది. ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టిన గూగుల్, అమెజాన్ వాటాల విలువ కూడా ఒక్కొక్కటి రూ.9.3 లక్షల కోట్లకు పైగా పెరిగింది.