భారతదేశంలో మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న పెళ్లిళ్ల సీజన్ దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ ఊపును తీసుకురానుంది. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 15 వరకు కేవలం 25 రోజుల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా సుమారు 52 లక్షల వివాహాలు జరగనున్నాయని అంచనా. వీటి ద్వారా ఏకంగా రూ.7.5 లక్షల కోట్ల విలువైన వ్యాపార లావాదేవీలు నమోదవుతాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) అంచనా వేసింది. ఈ ముహూర్తాల సీజన్.. రిటైల్, తయారీ, ఆతిథ్యం, రవాణా రంగాలకు అతిపెద్ద చోదక శక్తిగా మారనుందని వ్యాపారుల సమాఖ్య వెల్లడించింది.

పెళ్లిళ్లు కేవలం శుభకార్యాలుగానే కాకుండా వ్యాపారులు, తయారీదారులు, ఎంఎస్ఎంఈలు, చేతివృత్తుల కళాకారులు, సేవా రంగాలకు అండగా నిలిచే భారీ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందాయని సీఏఐటీ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్‌వాల్ స్పష్టం చేశారు. ఒక్క ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలోనే దాదాపు 5 లక్షల వివాహాలు జరగనుండగా, అక్కడ ఏకంగా రూ.2.5 లక్షల కోట్ల మేర వ్యాపారం సాగుతుందని అంచనా వేశారు. ఈ మొత్తం రూ.7.5 లక్షల కోట్ల ఖర్చులో సుమారు రూ.4 లక్షల కోట్లు (54 శాతం) వస్తువులు, రిటైల్ కొనుగోళ్ల ద్వారా సమకూరనుండగా.. సర్వీసుల రంగం రూ.3.45 లక్షల కోట్ల వాటాను దక్కించుకోనుంది.

వినియోగ వ్యయంలో సింహభాగం ఆభరణాలు, దుస్తులదే కానుంది. బంగారం, వజ్రాభరణాల కొనుగోళ్లు రూ.1.2 లక్షల కోట్లకు చేరనుండగా, వస్త్ర శ్రేణి రూ.90,000 కోట్ల వాటాతో తర్వాతి స్థానంలో నిలిచింది. గిఫ్ట్‌లు, ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, స్వీట్లు కూడా భారీగా అమ్ముడుపోనున్నాయి. సేవల విభాగంలో క్యాటరింగ్ రంగానికి రూ.75,000 కోట్లు, కల్యాణ మండపాలు, బాంక్వెట్ హాళ్లు, హోటళ్లకు మరో రూ.60,000 కోట్ల వ్యాపారం సమకూరనుంది. గత కొన్నేళ్లుగా వివాహ ఆర్థిక వ్యవస్థ శరవేగంగా విస్తరిస్తోంది. 2022లో రూ.3.75 లక్షల కోట్లుగా ఉన్న ఈ మార్కెట్ పరిమాణం ఏటేటా పెరుగుతూ ఈ ఏడాది రూ.7.50 లక్షల కోట్ల రికార్డు స్థాయికి చేరింది. అంతేకాకుండా, ఈ సీజన్ ద్వారా దాదాపు 1.25 కోట్ల మందికి తాత్కాలిక, పార్ట్‌టైమ్ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.