ఇటీవల మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సేవల్లో తలెత్తిన భారీ ప్రపంచవ్యాప్త అంతరాయంపై ఆ సంస్థ సీఈవో సత్య నాదెళ్ల విచారం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో యూజర్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన ఈ సమస్యను ముందే నివారించడంలో తాము మరింత మెరుగ్గా పనిచేసి ఉండాల్సిందని ఆయన అంగీకరించారు. సీఎన్‌బీసీతో మాట్లాడిన ఆయన.. సాఫ్ట్‌వేర్‌లో నిద్రాణంగా ఉన్న ఒక బగ్ ఒక్కసారిగా నిర్దిష్ట యూజర్ ట్రాఫిక్‌ను ఎదుర్కోవడంతోనే ఈ వ్యవస్థ కుప్పకూలిందని స్పష్టం చేశారు.

టెస్టింగ్ ప్రక్రియలోనే ఇలాంటి లోపాలను గుర్తించడంలో విఫలమయ్యామని, ఒక చిన్న లోపం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించకుండా పటిష్ఠమైన భద్రతా చర్యలు తీసుకుని ఉండాల్సిందని నాదెళ్ల పేర్కొన్నారు. గత వారం తొలుత ఔట్‌లుక్‌లో మొదలైన ఈ అంతరాయం.. ఆ తర్వాత క్రమంగా టీమ్స్, కోపైలట్, మైక్రోసాఫ్ట్ 365, షేర్‌పాయింట్, వన్‌డ్రైవ్ వంటి కీలక సేవలన్నింటికీ పాకింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులు దాదాపు ఒక రోజుకు పైగా సేవలందక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రాథమిక నివేదికల ప్రకారం ఈ ఏడాది మొదట్లోనే సిస్టమ్‌లోకి ప్రవేశించిన ఈ సాఫ్ట్‌వేర్ బగ్‌తో పాటు, విపరీతమైన ట్రాఫిక్, సర్వర్ సామర్థ్యం తగ్గడం వల్ల ఈ సమస్య ఏర్పడిందని తేలింది. అయితే దీని వెనుక ఎలాంటి సైబర్ దాడి ఆనవాళ్లు లేవని సంస్థ స్పష్టం చేసింది.

ఈ పరిణామం మొత్తం టెక్ పరిశ్రమ ఎదుర్కొంటున్న విస్తృత సవాలును ప్రతిబింబిస్తోందని నాదెళ్ల విశ్లేషించారు. కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత ద్వారా సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, లోపాల గుర్తింపు వేగవంతమైనప్పటికీ.. ఆ ప్యాచ్‌లను అంతే వేగంగా పాత సాంకేతిక వాతావరణంలోకి చేర్చడం ఆపరేషనల్ రిస్క్‌లకు దారితీస్తోందని ఆయన హెచ్చరించారు. కొత్త అప్‌డేట్‌లను పాత వ్యవస్థలు తట్టుకోలేకపోవడం వల్ల ఇలాంటి అనుకోని సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. ఇటీవల జరిగిన ఇగ్నైట్ సదస్సులో కోపైలట్‌ను పని ప్రదేశాల్లో ప్రధాన వేదికగా నిలపనున్నట్లు ప్రకటించిన మైక్రోసాఫ్ట్‌కు ఈ అంతరాయం పెద్ద ఎదురుదెబ్బగా మారింది.