ముంబైలో నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికాకముందే లగ్జరీ స్పోర్ట్స్ కారు 'ఫెరారీ'ని కస్టమర్‌కు అందజేసిన ప్రముఖ డీలర్‌షిప్‌పై మహారాష్ట్ర రవాణా శాఖ కఠిన చర్యలు తీసుకుంది. బాంద్రాలోని 'నవనీత్ మోటార్స్' ఔట్‌లెట్ ట్రేడ్ సర్టిఫికెట్‌ను 30 రోజుల పాటు సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాల ప్రకారం, ముంబై లాల్‌బాగ్‌కు చెందిన ఓ వ్యక్తి కొనుగోలు చేసిన ఎరుపు రంగు ఫెరారీ కారును అక్టోబర్ 13నే డీలర్ డెలివరీ చేశారు. ఈ వాహనానికి సంబంధించిన మోటార్ వెహికల్ పన్నును అక్టోబర్ 12న చెల్లించినప్పటికీ, అధికారికంగా వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ మాత్రం అక్టోబర్ 16 వరకు పూర్తి కాలేదు. రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండానే ఈ లగ్జరీ కారు ముంబై రోడ్లపై తిరుగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వ్యవహారం రవాణా శాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీనిపై స్పందించిన రవాణా కమిషనర్, వెంటనే విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని ప్రాంతీయ రవాణా కార్యాలయ (RTO) అధికారులను ఆదేశించారు.

కేంద్ర మోటారు వాహనాల నిబంధనల ప్రకారం, వాహనం రిజిస్ట్రేషన్ పూర్తయి, హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు (HSRP) తప్పనిసరిగా అమర్చిన తర్వాతే కస్టమర్‌కు వాహనాన్ని అప్పగించాల్సి ఉంటుంది. అయితే నవనీత్ మోటార్స్ ఈ నిబంధనలను బేఖాతరు చేస్తూ, నంబర్ ప్లేట్లు లేకుండానే వాహనాన్ని యజమానికి అప్పగించినట్లు విచారణలో స్పష్టమైంది. ఈ ఉల్లంఘనపై వివరణ కోరుతూ డీలర్‌కు నవంబర్ 6న విచారణకు అవకాశం కల్పించారు. అనంతరం నవంబర్ 12న డీలర్‌షిప్ ట్రేడ్ సర్టిఫికెట్‌ను 30 రోజుల పాటు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ సస్పెన్షన్ అమల్లో ఉన్నంత కాలం బాంద్రాలోని ఈ ఔట్‌లెట్ ద్వారా ఎలాంటి వాహనాలను రిజిస్ట్రేషన్ చేయడానికి వీల్లేదు.

మరోవైపు, రాష్ట్రంలో పన్ను ఎగవేతదారులపై కూడా మహారాష్ట్ర రవాణా శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. స్థానికంగా ఉండే మోటారు వాహన పన్నును ఎగ్గొట్టేందుకు ఇతర రాష్ట్రాల్లో వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్న వారిపై ప్రత్యేక తనిఖీలు ప్రారంభించింది. ఇతర రాష్ట్రాల నంబర్లతో మహారాష్ట్ర రోడ్లపై నిరంతరం తిరిగే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరిస్తూ, వాహన యజమానులు చట్టబద్ధమైన నిబంధనలను పాటించాలని అధికారులు స్పష్టం చేశారు.