గత కొంతకాలంగా తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించకపోవడంపై వస్తున్న ప్రచారానికి నటి శ్రీలీల తెరదించింది. తాను టాలీవుడ్‌కు దూరం కాలేదని, తన చదువు వల్లే కొత్త సినిమాలు అంగీకరించలేకపోయానని స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో జరిగిన 'ఓం' (ఓ.ఎం: ఆపరేషన్ మోల్) చిత్ర ప్రీరిలీజ్ వేడుకలో పాల్గొన్న ఆమె, ఈ మేరకు స్పష్టతనిచ్చింది.

ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత నిబంధనల ప్రకారం రెండేళ్ల పాటు మెడికల్ ఇంటర్న్‌షిప్ చేయాల్సి వచ్చిందని శ్రీలీల తెలిపింది. ఈ ఇంటర్న్‌షిప్ కోసం ముంబయిలోని డీవై పాటిల్ యూనివర్సిటీలో తాను ప్రత్యక్షంగా హాజరుకావడం తప్పనిసరి కావడంతో, కొత్త చిత్రాల షూటింగ్‌లకు సమయం కేటాయించలేకపోయానని వివరించింది. ఆ సమయంలోనే తాను ‘ఓం’ సినిమాకు మాత్రమే సంతకం చేశానని పేర్కొంది. మెడిసిన్ తప్ప తెలుగు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉండటానికి మరే ఇతర కారణాలు లేవని తేల్చిచెప్పింది.

ఇదే సమయంలో తన కెరీర్, సినిమాల ఎంపికపై కూడా శ్రీలీల మాట్లాడింది. "చాలా చిన్న వయసులో నటిగా ప్రయాణాన్ని మొదలుపెట్టాను. కెరీర్‌ తొలిరోజుల్లో సినిమాల ఎంపిక విషయంలో నాకు పెద్దగా స్వేచ్ఛ ఉండేది కాదు. వచ్చిన అవకాశాలను అంగీకరిస్తూ ముందుకు వెళ్లాను. కొన్ని సినిమాల తర్వాత తప్పులు ఎక్కడ జరుగుతున్నాయో అర్థమైంది. ఇప్పుడు సినిమాల ఎంపికలో పరిణతి వచ్చింది" అని వివరించింది.

ధనుష్ కథానాయకుడిగా నటించిన ‘ఓం’ చిత్రం నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో శ్రీలీల చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి. మెడికల్ బాధ్యతలు పూర్తి కావడంతో ఆమె త్వరలోనే మరిన్ని ప్రాజెక్టులతో తెలుగు తెరపై సందడి చేయనుంది.