హైదరాబాద్ మహానగరంలో నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని అధిగమించేందుకు ప్రభుత్వం సరికొత్త రవాణా వ్యవస్థపై దృష్టి సారించింది. నగరంలో సుమారు 35 కిలోమీటర్ల మేర 'పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్' (పీఆర్‌టీఎస్) ఏర్పాటు చేసే దిశగా అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. తొలి దశలో కూకట్‌పల్లి నుంచి నాలెడ్జ్ సిటీ వరకు రాయదుర్గం, బయోడైవర్సిటీ పార్క్ మీదుగా 64 స్టేషన్లతో ఈ కారిడార్‌ను నిర్మించాలని ప్రతిపాదించారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధ్యక్షతన బుధవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్ఎల్) అధికారులు ఈ ప్రతిపాదనలను సమర్పించారు. నగరంలోని కీలక కారిడార్లలో ప్రత్యామ్నాయ రవాణా మార్గంగా పీఆర్‌టీఎస్‌ను పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో సూచించిన నేపథ్యంలో ఈ సమీక్ష జరిగింది. ట్రాఫిక్ సాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యిమిస్తూ, తక్కువ ఖర్చుతో కూడిన నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయాలని సీఎస్ సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు.

ఈ వ్యవస్థలో ప్రత్యేకంగా నిర్మించిన ఎలివేటెడ్ కారిడార్లపై డ్రైవర్‌ రహిత ఎలక్ట్రిక్ 'పాడ్ కార్లు' నడుస్తాయి. ఇది మెట్రో రైలు, బస్సు సర్వీసులకు ప్రత్యామ్నాయం కాదని, వాటికి అనుసంధానంగా (ఫీడర్ సర్వీసుగా) పనిచేస్తుందని అధికారులు వివరించారు. ఈ నూతన రవాణా వ్యవస్థ ద్వారా 2030 నాటికి రోజుకు 3.94 లక్షల మంది, 2050 నాటికి దాదాపు 10 లక్షల మంది ప్రయాణించే అవకాశం ఉందని అంచనా వేశారు.

ప్రాజెక్టుకు సంబంధించి సాంకేతిక నిపుణులతో సంప్రదింపులను వేగవంతం చేయాలని సీఎస్ సూచించారు. మున్సిపల్, ఇంధన, దక్షిణ మధ్య రైల్వే వంటి వివిధ శాఖలతో సమన్వయం చేసుకుని, నగర భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా గచ్చిబౌలిలోని ఐకియా సమీపంలో డిపో, మల్టీలెవల్ పార్కింగ్ సౌకర్యాలను కూడా ప్రతిపాదించారు. ప్రస్తుతం ఈ ప్రణాళిక ప్రాథమిక పరిశీలన దశలో ఉండగా, రూట్ మ్యాపింగ్‌తో పాటు సంబంధిత భాగస్వామ్య పక్షాలతో చర్చలు కొనసాగుతున్నాయి.