సూపర్‌స్టార్ రజనీకాంత్ తన పెద్ద మనవడు యాత్రతో కలిసి దిగిన అదిరిపోయే స్టైలిష్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ గురువారం తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ ఫొటోను పంచుకున్నారు. అందులో తాత, మనవళ్లు ఇద్దరూ పక్కపక్కనే నడుస్తూ కెమెరాకు ఇచ్చిన పోజు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఈ ఫొటోలో తలైవా బ్రౌన్ కలర్ టీ-షర్ట్, బ్లాక్ ట్రౌజర్స్, దానికి తోడు స్పోర్ట్స్ క్యాప్‌తో ఎంతో కూల్‌గా కనిపించగా.. మనవడు యాత్ర పూర్తి తెల్లటి దుస్తుల్లో తాతకు తగ్గ జోడీగా ఎంతో స్టైలిష్‌గా మెరిశాడు. ఐశ్వర్య, ప్రముఖ నటుడు ధనుష్‌ల పెద్ద కుమారుడే యాత్ర. 2006 అక్టోబర్ 10న జన్మించిన యాత్రతో పాటు ఈ జంటకు 2010లో పుట్టిన లింగా అనే మరో కుమారుడు కూడా ఉన్నాడు. 18 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత ఐశ్వర్య, ధనుష్ పరస్పర అంగీకారంతో విడిపోయిన సంగతి తెలిసిందే.

ఇటీవల రజనీకాంత్ తన కుటుంబ సభ్యులతో కలిసి గ్రీస్‌లో సరదాగా గడిపారు. తన చిన్న కుమార్తె సౌందర్య రజనీకాంత్ కూడా ఏథెన్స్ నగరంలో కుటుంబమంతా కలిసి గడిపిన అందమైన క్షణాల ఫొటోలను షేర్ చేస్తూ.. ఈ టూర్ ఎప్పటికీ గుర్తుండిపోయే మధుర జ్ఞాపకమని పేర్కొన్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు, రజనీకాంత్ బంధువైన అనిరుధ్ రవిచందర్ వివాహం కోసమే కుటుంబమంతా కలిసి గ్రీస్ వెళ్లినట్లు తెలిసింది. సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్ కుమార్తె, సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్‌తో నవంబర్ 11న జరిగిన అనిరుధ్ వివాహ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.