నేడు (నవంబరు 19) అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని పురస్కరించుకుని టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పురుషులందరికీ సెల్యూట్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న #RaPo23 చిత్రం నుంచి ఒక అదిరిపోయే ప్రీ-లుక్ పోస్టర్‌ను విడుదల చేశాడు. ఈ సినిమాలో తాను పోషిస్తున్న 'లోన్ వోల్ఫ్' పాత్ర వెనుక భాగాన్ని ఆవిష్కరిస్తూ రిలీజ్ చేసిన ఈ పోస్టర్ సినీ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటోంది.

తన 'ఎక్స్' ఖాతా ద్వారా ఈ పోస్టర్‌ను పంచుకున్న రామ్.. "లోన్ వోల్ఫ్: తన సొంత మార్గాన్ని ఎంచుకుని, ప్రపంచాన్ని ఒంటరిగానే ఢీకొట్టే అత్యంత స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తి" అంటూ ఆ పాత్ర తాలూకు స్వభావాన్ని నిర్వచించాడు. అంతర్గత బలం, మొక్కవోని దృఢ సంకల్పం కలిగిన ఒక బలమైన వ్యక్తిత్వంతో ఈ నియో-నాయర్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాతో రామ్ తన కెరీర్‌లో సరికొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టాడు. నటుడిగానే కాకుండా మొదటిసారిగా రచయితగా, దర్శకుడిగా మెగాఫోన్ పట్టి సరికొత్త బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు.

ఈ చిత్రంలో రామ్‌తో పాటు బాలీవుడ్ ప్రముఖ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్, సంయుక్తా మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక సాంకేతిక బృందం విషయానికి వస్తే.. ప్రతిభావంతుడైన ఎస్.తిరునావుక్కరసు డీవోపీగా పనిచేస్తుండగా, సౌత్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్ సంగీతం సమకూరుస్తున్నాడు. ‘రాపో’ సినిమాటిక్స్ బ్యానర్‌పై కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వినూత్నమైన కథాంశం, అద్భుతమైన నటీనటుల కలయికతో తెలుగు ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ అనుభూతిని పంచేందుకు రామ్ సిద్ధమవుతున్నాడు.