బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘అక్వాన్’ తీరం దాటే సమయానికి తీవ్రత తగ్గి బలహీనపడనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ తుపాను గత ఆరు గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదిలింది. గురువారం వేకువజామున 5:30 గంటల సమయానికి నరసాపురం, కళింగపట్నానికి తూర్పు-ఆగ్నేయంగా 440 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు దక్షిణంగా 530 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతోంది.

ఈ వ్యవస్థ మరింతగా ఉత్తర-వాయవ్య దిశగా పయనించి శుక్రవారం (నవంబర్ 20) మధ్యాహ్నానికి నరసాపురం-పూరీ మధ్య, గోపాల్‌పూర్‌కు తూర్పునకు సమీపంలో తీరం దాటనుంది. ఆ సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్లు, గరిష్ఠంగా 110 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. అయితే తాజా సమాచారం మేరకు తీరం దాటే ముందే ఈ తుపాను బలహీనపడుతుందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) స్పష్టం చేసింది.

ఈ తుపాను ప్రభావం ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాలపైనే తీవ్రంగా ఉండే అవకాశం ఉండగా, మధ్య, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలకు ముప్పు తప్పినట్లేనని అధికారులు తెలిపారు. గురువారం ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురవనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు వచ్చే 24 నుంచి 36 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలు, చెరువుల పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

మరోవైపు హోంమంత్రి వంగలపూడి అనిత ఉన్నతాధికారులతో ముందస్తు చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని, వచ్చే 48 గంటలు అన్ని శాఖలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అత్యవసర సహాయక చర్యల కోసం 13 ఎన్డీఆర్ఎఫ్, 11 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. ప్రజలకు సహాయం అందించేందుకు జిల్లా, మండల కేంద్రాల్లో 24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు.