బిజీ లైఫ్‌లో ప్రయాణాలు, ఆఫీస్ మీటింగులు లేదా సరైన వాష్‌రూమ్ దొరక్కపోవడం వల్ల చాలామంది మూత్ర విసర్జనను వాయిదా వేస్తుంటారు. గంట రెండు గంటలు ఆపుకోవడం వల్ల తక్షణమే పెద్ద నష్టం జరగకపోయినా, ఇదే పనిగా గంటల తరబడి ఆపుకోవడం లేదా రోజంతా మూత్రానికి వెళ్లకుండా ఉండటం ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుంది. అసలు మానవ శరీరం ఎంత సమయం వరకు మూత్రాన్ని నిల్వ చేసుకోగలదు? ఎప్పుడు అప్రమత్తం కావాలి?

మూత్రాశయ సామర్థ్యం ఎంత?
మానవ మూత్రాశయానికి (బ్లాడర్) సాగే గుణం ఉంటుంది. ఇది సాధారణంగా 500 నుంచి 600 మిల్లీలీటర్ల మూత్రాన్ని నిల్వ చేసుకోగలదు. పురుషుల్లో 200 నుంచి 300 ఎంఎల్, స్త్రీలలో 250 నుంచి 350 ఎంఎల్ మూత్రం చేరగానే బ్రెయిన్‌కు సంకేతాలు వెళ్లి విసర్జన చేయాలనే భావన కలుగుతుంది. అంటే మూత్రాశయం కేవలం పావు వంతు నిండగానే మెదడు అలర్ట్ చేస్తుంది. సాధారణంగా 400 నుంచి 500 ఎంఎల్ మూత్రం ఉత్పత్తి కావడానికి శరీరానికి 8 నుంచి 9 గంటల సమయం పడుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ సమయం వరకు శరీరానికి పెద్దగా హాని కలగదు. కానీ తాగే ద్రవాల పరిమాణాన్ని బట్టి ఈ కాలపరిమితి మారుతుంది.

రోజుకు ఎన్నిసార్లు వెళ్లడం సాధారణం?
పెద్దలు రోజుకు సగటున ఆరు నుంచి ఏడు సార్లు మూత్ర విసర్జనకు వెళ్లడం ఆరోగ్యకరం. కనీసం నాలుగు నుంచి పది సార్లు వెళ్లినా దాన్ని సాధారణ పరిధిగానే పరిగణించవచ్చు. చిన్నపిల్లల మూత్రాశయ సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల వారు ఎక్కువసార్లు వెళ్తుంటారు. అయితే డయాబెటిస్, గర్భధారణ, హైబీపీ మందులు వాడేవారిలో ఈ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది. తగినంత నీరు తాగకపోతే డీహైడ్రేషన్ బారినపడి మూత్రం ముదురు పసుపు రంగులోకి మారడం, తలతిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

మూత్రం సరిగ్గా రాకపోతే సమస్యలేంటి?
మూత్రం వస్తున్నట్లు అనిపించినా సరిగ్గా విసర్జించలేకపోవడం లేదా మంట రావడం వెనుక కిడ్నీ వైఫల్యం, యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ (యూటీఐ), ప్రోస్టేట్ గ్రంథి వాపు వంటి అంతర్గత రుగ్మతలు ఉండవచ్చు. ఇలాంటి ఇబ్బందులు 36 నుంచి 48 గంటలకు మించి కొనసాగితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. పిల్లల విషయంలో రోజుకు నాలుగు కంటే తక్కువ సార్లు డైపర్లు తడిసినా లేదా రంగు మారినా జాగ్రత్త పడాలి.

ఎక్కువసేపు ఆపుకుంటే ఏం జరుగుతుంది?
అరుదుగా ప్రయాణాల్లో కొద్ది గంటలు ఆపుకుంటే పెద్ద నష్టం ఉండదు. కానీ, క్రమం తప్పకుండా ఆపుకునే అలవాటు ఉంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్లు (యూటీఐ) దాడి చేస్తాయి. 10 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం ఆపుకుంటే మూత్రాశయ కండరాలు విసర్జన సమయంలో రిలాక్స్ అవ్వలేవు. దీనివల్ల యూరినరీ రిటెన్షన్ సమస్య తలెత్తుతుంది. కొందరిలో బ్లాడర్ సాగిపోయి అదుపు తప్పడం (ఇన్‌కాంటినెన్స్) జరుగుతుంది.

ప్రాణాపాయం ఉంటుందా?
మూత్రం ఆపుకోవడం వల్ల చనిపోయే అవకాశాలు అత్యంత అరుదు. సాధారణంగా శరీరం తన పరిమితి దాటితే అప్రయత్నంగానే విసర్జించేస్తుంది. కానీ తీవ్రమైన నిర్లక్ష్యంతో చాలా రోజులు ఆపితే హానికర బ్యాక్టీరియా చేరి సెప్సిస్‌కు దారితీయవచ్చు. అత్యంత అరుదైన కేసుల్లో మూత్రాశయం చిట్లిపోయి ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. కాబట్టి శరీర సంకేతాలను గుర్తించి, మూత్ర విసర్జన భావన కలగ్గానే ఆలస్యం చేయకుండా బయటకు వెళ్లిపోవడం శ్రేయస్కరం.