రాప్తాడులో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడి బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక ఆరోగ్యంపై రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రత్యేకంగా సమీక్షించారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి మణిపాల్ ఆసుపత్రి వైద్యులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. బాలిక ఆరోగ్య పరిస్థితి, ప్రస్తుతం అందుతున్న వైద్యం, కోలుకుంటున్న తీరు, డిశ్చార్జ్ అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. బాలిక ఆరోగ్యంలో గణనీయమైన మార్పు కనిపిస్తోందని తెలిపారు. ప్రస్తుతం వెంటిలేటర్ సాయం లేకుండానే శ్వాస తీసుకుంటోందని, ఆక్సిజన్ స్థాయిలు నిలకడగా ఉన్నాయని వివరించారు. నోటి ద్వారా ఆహారం తీసుకుంటోందని, ప్రధాన గాయాలు మానిపోవడంతో కుట్లు కూడా తొలగించామని చెప్పారు. ప్రస్తుతం ఇతరుల సహాయంతో నడుస్తోందని, గతంతో పోలిస్తే ఎక్కువ అడుగులు వేయగలుగుతోందని పేర్కొన్నారు. కుడిచేత్తో నీళ్ల గ్లాసు పట్టుకుంటోందని, పెన్ను పట్టుకుని రాసేందుకు అవసరమైన శిక్షణ కూడా ఇస్తున్నామని తెలిపారు. గతంలో జరిగిన విషయాలను గుర్తుచేసుకుంటోందని, రెండు రోజుల క్రితం నవ్వమని అడిగితే నవ్విందని వైద్యులు వివరించారు. బాలికలో ఆత్మవిశ్వాసం పెరుగుతోందని, త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వైద్య బృందం వెల్లడించింది.

వైద్యుల మాటలపై మంత్రి లోకేశ్ హర్షం వ్యక్తం చేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. "ఆ చిన్నారి నిజమైన ఫైటర్. ప్రాణాలతో ధైర్యంగా పోరాడి ఇప్పుడు వేగంగా కోలుకుంటోంది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినంత మాత్రాన మా బాధ్యత తీరిపోదు. ఆ అమ్మాయి మన బిడ్డ. తను శారీరకంగా, మానసికంగా పూర్తిగా కోలుకుని సాధారణ జీవితాన్ని గడిపే వరకు ఆ కుటుంబానికి పూర్తి అండగా ఉంటాం" అని మంత్రి స్పష్టం చేశారు. చిన్న వయసులోనే తీవ్రమైన గాయాన్ని ఎదుర్కొన్న ఆ బిడ్డకు వైద్యంతో పాటు మానసిక ధైర్యం, ఆప్యాయత ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.

డిశ్చార్జ్ తర్వాత కూడా బాలిక సంరక్షణలో ఎలాంటి లోటు రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు, వైద్యులకు లోకేశ్ దిశానిర్దేశం చేశారు. స్థానికంగా మానసిక వైద్య నిపుణుడిని అందుబాటులో ఉంచడంతో పాటు, అనంతపురం సర్వజన ఆసుపత్రి సహకారంతో పునరావాస చికిత్స కోసం ప్రత్యేక థెరపిస్ట్‌ను నియమించనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో అవసరమయ్యే ఆర్థోపెడిక్ చికిత్స, ఫిజియోథెరపీ, తదుపరి శస్త్రచికిత్సలపై పూర్తి స్థాయి ప్రణాళికను సిద్ధం చేయాలని మణిపాల్ వైద్యులకు సూచించారు. ఇంటి వద్ద ఇన్ఫెక్షన్లు సోకకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు.

చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు అహర్నిశలు శ్రమించిన మణిపాల్ ఆసుపత్రి వైద్యులకు మంత్రి లోకేశ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఘటన జరిగిన వెంటనే అనంతపురంలో సకాలంలో ప్రాథమిక చికిత్స అందించిన వైద్యుల సేవలను కూడా ఆయన కొనియాడారు. బృందంలోని ఒక వైద్యుడు బాలికతో తెలుగులో మాట్లాడుతూ ధైర్యం నింపుతున్నారని వైద్యులు తెలపగా.. బాలిక ఆరోగ్యం మెరుగుపడుతుండటంపై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తూ, మొదటి నుంచీ అండగా నిలుస్తున్న మంత్రి లోకేశ్ కు ధన్యవాదాలు తెలిపారు.