ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ వ్యక్తి కలకలం సృష్టించాడు. సరైన ప్రయాణ పత్రాలు లేకుండా టెర్మినల్-3లోకి బలవంతంగా ప్రవేశించేందుకు యత్నించగా, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సిబ్బంది అతడి ప్రయత్నాన్ని సమర్థవంతంగా అడ్డుకున్నారు.

నిన్న మధ్యాహ్నం సమయంలో టెర్మినల్-3 డిపార్చర్ గేట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. హర్యానాకు చెందిన వ్యక్తిగా గుర్తించిన సదరు నిందితుడిని టికెట్, గుర్తింపు కార్డు చూపాలని భద్రతా సిబ్బంది కోరగా, అతడు ఏమాత్రం పట్టించుకోలేదు. వారిని తోసుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్ సిబ్బంది, క్విక్ రెస్పాన్స్ టీమ్ (క్యూఆర్‌టీ) సహాయంతో అతడిని క్షణాల్లో అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనపై సీఐఎస్ఎఫ్ 'ఎక్స్' వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది. తమ సిబ్బంది అసాధారణ అప్రమత్తత, శీఘ్ర స్పందనతో భద్రతా వైఫల్యాన్ని నివారించారని పేర్కొంది. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా పంచుకుంది. నిందితుడి బ్యాగులో గుర్తింపు పత్రాలు, విద్యా, క్రీడా ధ్రువీకరణ పత్రాలు, ఇతర వ్యక్తిగత వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం అతడిని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు.