రాష్ట్రంలో జరగనున్న 23 పట్టణ స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి ముఖ్య నేతలు, గ్రామస్థాయి కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల సన్నద్ధత, క్షేత్రస్థాయి వ్యూహాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థుల విజయం కోసం ప్రతి ఒక్కరూ సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రస్థాయిలో కూటమి పార్టీల మధ్య ఉన్న సఖ్యత, సమన్వయం క్షేత్రస్థాయిలోనూ కనిపించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గ్రామస్థాయిలోనే బలమైన నాయకత్వం రూపుదిద్దుకోవాలని, స్థానిక సమస్యలకు అక్కడే పరిష్కారం లభించే వాతావరణం రావాలని ఆయన ఆకాంక్షించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు మంచి, చెడులను బేరీజు వేసుకుని తీర్పు ఇచ్చారని గుర్తుచేసిన ఆయన, ప్రభుత్వం చేపడుతున్న మంచి పనులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి ఈ పంచాయతీ ఎన్నికలను వేదికగా చేసుకోవాలని సూచించారు.

ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరిస్తూ.. సూపర్ సిక్స్ హామీల అమలుతో పాటు పీ4 కార్యక్రమం ద్వారా పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతి ఇంటి అవసరాలను, గ్రామాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, భారీ పెట్టుబడుల ద్వారా పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగ–ఉపాధి అవకాశాలు, రోడ్ల నిర్మాణం, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి వంటి అంశాల్లో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు.

ఇదే సమయంలో ప్రత్యర్థి పార్టీ విధానాలపై సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ప్రత్యర్థి పార్టీ అనుసరిస్తున్న రాజకీయ ఎత్తుగడలు, వివాదాస్పద వైఖరిని ప్రజలకు వివరించి అప్రమత్తం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఎన్నికల్లో ప్రతి ఓటూ ఎంతో కీలకమని, కూటమి కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను కలవాలని చెప్పారు. భవిష్యత్తులో రాబోయే 2029 సార్వత్రిక ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకుని, మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఒకే తాటిపై నడవాలని ఆయన దిశానిర్దేశం చేశారు.