ఐసీఐసీఐ బ్యాంక్ తమ క్రెడిట్ కార్డు వినియోగదారులకు కీలక అప్‌డేట్ ఇచ్చింది. సేవల నిర్వహణను మరింత క్రమబద్ధీకరించే లక్ష్యంతో పలు నిబంధనలు, సేవా రుసుములను సవరిస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా కార్డులపై ఇప్పటివరకు అందించిన కొన్ని ఉచిత ప్రయోజనాలను తొలగించడంతో పాటు, పలు సేవలపై ఛార్జీలను పెంచింది. ఈ కొత్త మార్పులు నవంబర్ 25 నుంచి అమల్లోకి రానున్నాయి.

డిసెంబర్ 15 నుంచి ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై ఉచిత ఐనాక్స్ సినిమా టికెట్ల ఆఫర్‌ను బ్యాంక్ నిలిపివేయనుంది. రూబిక్స్, కోరల్, ఎక్స్‌ప్రెషన్స్, మేక్‌మైట్రిప్ ప్లాటినం, మేక్‌మైట్రిప్ సిగ్నేచర్, హెచ్‌పీసీఎల్ సూపర్ సేవర్, ఎమిరేట్స్ రూబిక్స్ వంటి కార్డులపై ఇకపై ఈ బెనిఫిట్ ఉండదు. అలాగే ఉచిత వ్యక్తిగత, విమాన ప్రమాద బీమాతో పాటు ప్రయాణ రద్దు బీమాను కూడా ఉపసంహరించుకుంది. ఎమరాల్డ్, శాఫైరో, రూబిక్స్, పరాక్రమ్ వంటి ప్రముఖ కార్డుదారులకు ఈ బీమా రక్షణ ఇకపై లభించదు.

మరోవైపు అంతర్జాతీయ లావాదేవీలపై విధించే డైనమిక్ కరెన్సీ కన్వర్షన్ ఫీజు నవంబర్ 25 నుంచి 1 శాతం నుంచి 3.50 శాతానికి పెరగనుంది. విదేశాల్లో నమోదైన వ్యాపారులతో భారత కరెన్సీలో జరిపే లావాదేవీలకు ఇది వర్తిస్తుంది. కార్డు పోయినప్పుడు లేదా దెబ్బతిన్నప్పుడు కొత్త కార్డు పొందే రీప్లేస్‌మెంట్ ఛార్జీని రూ.200 నుంచి రూ.300 (జీఎస్టీ అదనం)కి పెంచారు. ఈ నిర్ణయాలు క్రెడిట్ కార్డు యూజర్లపై అదనపు భారం మోపనున్నాయి.