ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన సారథి, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ ఆటగాడిగా తన ప్రస్థానానికి ముగింపు పలికాడు. ఆటగాడి పాత్ర నుంచి వైదొలిగిన ధోనీ, ఇకపై చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మెంటార్‌గా సరికొత్త బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. మైదానంలో తన ఆటతో కోట్లాది మందిని అలరించిన 'తలా' ధోనీ నిర్ణయంపై తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటులు, దర్శకులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. స్టార్ హీరోలు ధనుష్, కార్తీతో పాటు ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు సోషల్ మీడియా వేదికగా అతడికి హృదయపూర్వక నీరాజనాలు సమర్పించారు.

చెన్నై సూపర్ కింగ్స్‌కు, ధోనీకి వీరాభిమాని అయిన ప్రముఖ నటుడు, నిర్మాత ధనుష్ తన ‘ఎక్స్’ ఖాతాలో ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. "కొందరు ఆటగాళ్లు మనల్ని అలరిస్తారు. మరికొందరు మన జీవితాల్లో ఒక భాగమైపోతారు. ఎంఎస్ ధోనీ ఈ రెండూ అయ్యారు. మాకు అందించిన అద్భుతమైన జ్ఞాపకాలకు ధన్యవాదాలు. మీరు మైదానంలో ఆడకుండా క్రికెట్ మునుపటిలా ఉండదు. కానీ, డగౌట్ వద్ద మిమ్మల్ని చూసేందుకు వేచి చూస్తుంటాను. మీ సలహాలు, విలువైన సూచనలు వేలాది మంది యువతకు ఎంతగానో మేలు చేశాయి. రాబోయే తరానికి కూడా అవి నిరంతరం స్ఫూర్తినిస్తాయని ఆశిస్తున్నాను. ఫేర్‌వెల్ ఛాంపియన్" అని ధనుష్ పేర్కొన్నారు.

ధనుష్ కుటుంబానికి సీఎస్కే ఫ్రాంచైజీతో ప్రత్యేక అనుబంధం ఉంది. ధనుష్ సోదరుడు, దర్శకనటుడు సెల్వరాఘవన్ భార్య గీతాంజలి సెల్వరాఘవన్ తండ్రి పి.ఎస్. రామన్ గతంలో తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన రచించిన ‘లియో: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ చెన్నై సూపర్ కింగ్స్’ పుస్తకావిష్కరణ సభకు ధోనీతో పాటు సీఎస్కే బృందం హాజరై కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరిచిన సంగతిని గతంలో గీతాంజలి గుర్తు చేసుకున్నారు.

మరోవైపు, ప్రముఖ నటుడు కార్తీ కూడా ధోనీ ఘనతను కొనియాడుతూ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. "ఒక సాధారణ యువకుడు మన కళ్ల ముందే ఒక దిగ్గజంగా ఎదగడాన్ని ప్రత్యక్షంగా చూసిన తరంలో భాగమైనందుకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ధోనీ సాబ్.. జెర్సీ నంబర్ 7 అనేది ఎప్పటికీ కేవలం ఒక అంకె మాత్రమే కాదు. చెన్నై ప్రజలకు అది ఎన్నో భావోద్వేగాలు, మరువలేని విజయాలు, చివరి వరకు మ్యాచ్ ముగియలేదనే నమ్మకాన్ని కలిగించిన అద్భుత క్షణాలకు నిదర్శనం. మీ ఆటతోనే కాకుండా మీ వినమ్రత, హుందాతనంతో మైదానంలోనూ, బయటా ఒక తరం మొత్తానికి ఆదర్శంగా నిలిచారు. మీ ప్రయాణం ఎక్కడికి సాగినా, మీరు ఎప్పటికీ మా 'తలా'నే..." అంటూ కార్తీ తన అభిమానాన్ని చాటుకున్నారు.

వీరితో పాటు దర్శకుడు వెంకట్ ప్రభు కూడా స్పందిస్తూ, "ధోనీ అందించిన ప్రతి జ్ఞాపకానికి, చూపిన ప్రేమకు, నింపిన స్ఫూర్తికి ధన్యవాదాలు. ఫేర్‌వెల్ మై కెప్టెన్" అంటూ పోస్ట్ చేశారు. మైదానంలో ధోనీ హెలికాప్టర్ షాట్లు, మెరుపు స్టంపింగులను మిస్ అవుతున్నప్పటికీ, మెంటార్‌గా సీఎస్కే డగౌట్‌లో అతడు ఇచ్చే మార్గదర్శకాలను చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.