పంజాబ్‌కు చెందిన ఓ సాధారణ ట్రక్కు డ్రైవర్‌ను అదృష్టం వరించింది. కేవలం రూ.500 వెచ్చించి కొనుగోలు చేసిన లాటరీ టికెట్ ఆయన జీవితాన్నే మార్చేసింది. ఏకంగా రూ.12 కోట్ల భారీ జాక్‌పాట్‌ను ఆయన సొంతం చేసుకున్నాడు. గత 15 ఏళ్లుగా ప్రతి పండుగ సీజన్‌లోనూ లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్న ఆయనకు ఎట్టకేలకు ఈ విజయం లభించింది.

మొహాలీ జిల్లా డేరాబస్సీ సమీపంలోని హమ్యున్‌పూర్ గ్రామానికి చెందిన బల్జీందర్ సింగ్ (45) టిప్పర్ ట్రక్కు నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాడు. ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2010 నుంచి ప్రతి పండుగకు లాటరీ టికెట్లు కొనడాన్ని ఆయన అలవాటుగా మార్చుకున్నాడు. అయితే, ఈ విషయాన్ని ఆయన తన కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా రహస్యంగా ఉంచడం గమనార్హం. ఈ ఏడాది దీపావళి సందర్భంగా జిరాక్‌పూర్‌లో రూ.500 వెచ్చించి ‘పంజాబ్ స్టేట్ డియర్ దీపావళి బంపర్-2026’ టికెట్‌ను కొనుగోలు చేశాడు.

నవంబర్ 16న నిర్వహించిన డ్రాలో బల్జీందర్ కొనుగోలు చేసిన టికెట్‌కే మొదటి బహుమతి లభించింది. తనకు రూ.12 కోట్ల జాక్‌పాట్ తగిలిందన్న విషయం సోమవారం రాత్రి తెలియడంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మంగళవారం ఆయన లాటరీ కార్యాలయానికి చేరుకుని, బహుమతి మొత్తాన్ని క్లెయిమ్ చేసుకునేందుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను అధికారులకు సమర్పించాడు.

ఈ భారీ మొత్తాన్ని దేని కోసం వినియోగిస్తారని అడిగిన ప్రశ్నకు.. తన ఇద్దరు పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించడమే తన ప్రథమ ప్రాధాన్యత అని బల్జీందర్ వెల్లడించాడు. వారి ఉన్నత చదువుల కోసం ఈ డబ్బును వెచ్చిస్తానని ఆయన తెలిపాడు. కాగా, బల్జీందర్‌కు లాటరీ తగిలిన వార్త తెలియడంతో హమ్యున్‌పూర్ గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. బంధుమిత్రులు, స్థానికులు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకుని అభినందనలు తెలియజేస్తున్నారు.