జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో భద్రతా దళాలు జరిపిన భారీ ఎన్‌కౌంటర్‌లో లష్కరే తొయిబా మోస్ట్ వాంటెడ్ ‘కేటగిరీ-ఎ’ ఉగ్రవాది లతీఫ్ భట్ (23) హతమయ్యాడు. స్థానిక మసీదులో నక్కి ఉన్న అతడిని ప్రాణాలతో పట్టుకునేందుకు వీడియో కాల్ ద్వారా లొంగిపోవాలని బలగాలు అవకాశం ఇచ్చినా నిరాకరించాడు. బలగాలపైకి కాల్పులు జరపడంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపి అతడిని అక్కడికక్కడే మట్టుబెట్టారు. 

ఈ ఆపరేషన్‌లో మసీదుకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా బలగాలు అత్యంత సంయమనం పాటించాయి. కశ్మీర్ లోయలో మిగిలి ఉన్న ఏకైక క్రియాశీల స్థానిక ఉగ్రవాది అతడేనని భద్రతా వర్గాలు తెలిపాయి.

సరిగ్గా లష్కరే తొయిబాలో చేరిన ఏడాదికే లతీఫ్ భట్ అంతం కావడం గమనార్హం. 2025 నవంబర్ 18న ఉగ్రవాద బాట పట్టిన అతడు.. సరిగ్గా ఏడాది తర్వాత బలగాల చేతిలో హతమయ్యాడు. దక్షిణ కశ్మీర్‌లో లష్కర్ స్థానిక కమాండర్‌గా ఉంటూ ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (టీఆర్‌ఎఫ్), కశ్మీర్ రివల్యూషనరీ ఆర్మీ (కేఆర్‌ఏ) సంస్థలతో సంబంధాలు కొనసాగించాడు. ఉగ్రవాదంలోకి రాకముందు అతడు వడ్రంగిగా పనిచేశాడు. భాన్‌లో 8వ తరగతి, అష్ముజీలో 12వ తరగతి చదివి.. కుల్గాం ప్రభుత్వ కళాశాలలో డిగ్రీలో చేరి మధ్యలోనే మానేశాడు.

దక్షిణ కశ్మీర్‌లో పలు దాడులకు ఇతడే ప్రధాన సూత్రధారి. జులై 22న అనంత్‌నాగ్‌లో ఓ పోలీస్ అధికారి హత్య, ఆగస్టు 1న కుల్గాంలో ఇద్దరు వలస కార్మికుల హత్యల్లో ఇతడి ప్రమేయం ఉంది. నవంబర్ 11న కుల్గాంలో సీఆర్‌పీఎఫ్ చెక్‌పోస్టుపై దాడి చేసి ముగ్గురు జవాన్లను గాయపరిచాడు. ఈ దాడికి ముందు రెక్కీ నిర్వహించిన దృశ్యాలు సీసీటీవీల్లో నమోదయ్యాయి. గత ఐదారు నెలలుగా ఇతడికి ఆశ్రయం, లాజిస్టిక్స్ సమకూర్చిన స్థానిక సహచరుడు ఉమర్ నిసార్ దార్‌ను నవంబర్ 16న జరిగిన ఎన్‌కౌంటర్‌లో సైన్యం హతమార్చింది. అప్పుడు లతీఫ్ తప్పించుకున్నాడు. 

చివరకు పక్కా సమాచారంతో చేపట్టిన ఆపరేషన్‌లో అతడిని భద్రతా దళాలు అంతమొందించాయి. పాకిస్థాన్‌లోని ఇతడి హ్యాండ్లర్లు, ఆయుధాలు సమకూర్చిన నెట్‌వర్క్‌పై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.