ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల 12వ వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) ప్రక్రియలో కీలక పురోగతి నమోదైంది. ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి పరిశీలించాల్సిన అంశాలతో కూడిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విధివిధానాలపై ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు తమ సూచనలు, అభ్యంతరాలను సమర్పించడానికి డిసెంబర్ 31 వరకు గడువు నిర్దేశించింది. ఆ గడువులోగా అందే అభిప్రాయాలను పరిశీలించి, అవసరమైన మార్పులు చేసిన తర్వాతే పీఆర్సీ కమిషన్ ప్రభుత్వానికి తుది నివేదికను అందజేయనుంది.

యూజీసీ, ఎన్సీటీఈ, బార్ కౌన్సిల్ పరిధిలోని ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల అధ్యాపకులతో పాటు జాతీయ న్యాయ వేతన సంఘం పరిధిలోకి వచ్చే న్యాయాధికారులకు ఈ పీఆర్సీ వర్తించదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థలు, ఎయిడెడ్ విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల బోధనేతర సిబ్బంది, శాశ్వత కంటింజెంట్ ఉద్యోగుల జీతభత్యాలు, సర్వీస్ నిబంధనలపై కమిషన్ ప్రధానంగా దృష్టి సారించనుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న కరవు భత్యాన్ని (డీఏ) మూలవేతనంలో ఎంతవరకు విలీనం చేయాలన్న దానిపై అధ్యయనం చేసి నూతన పే స్కేళ్లను ఖరారు చేయనుంది.

ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ అమలులో ఎదురవుతున్న సమస్యలను పరిశీలించి, దాని కొనసాగింపు లేదా మార్పులపై సిఫారసులు ఇవ్వనుంది. వీటితో పాటు స్పెషల్ పే, ఇతర అలవెన్సుల చెల్లింపు నిబంధనలను, పెన్షనర్ల ప్రస్తుత పింఛను విధానాన్ని కూడా కమిషన్ సమీక్షించనుంది. పోస్టులను గ్రేడెడ్ విధానంలోకి మార్చడం, కాంట్రాక్ట్, డిప్యుటేషన్ నిబంధనలను పరిగణనలోకి తీసుకుని శాఖలవారీగా మానవ వనరుల అవసరాలను తేల్చనుంది. ఈ సిఫారసులన్నింటినీ ఖరారు చేసే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కమిషన్ పరిగణనలోకి తీసుకుంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.