తెలంగాణ రెవెన్యూ, స్టాంప్‌లు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ, 2012 బ్యాచ్ ఐఏఎస్ అధికారి రాజీవ్‌ హనుమంతు ప్రయాణిస్తున్న కారు ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆయనతో పాటు కుటుంబసభ్యులు గాయపడ్డారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం చాపరాళ్లపల్లి సమీపంలోని 565వ నంబర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

రాజీవ్ హనుమంతు తన కుటుంబసభ్యులతో కలిసి కారులో తిరుమల శ్రీవారి దర్శనం ముగించుకుని శ్రీశైలం వెళ్తుండగా, మార్గమధ్యంలో వారి కారు ఎదురుగా వచ్చిన ఓ స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న రాజీవ్ హనుమంతు, ఆయన కుటుంబసభ్యులు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు స్పందించి క్షతగాత్రులను తొలుత ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు.

ఈ సమాచారం అందుకున్న ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెంటనే ఆత్మకూరు ఆసుపత్రికి చేరుకున్నారు. క్షతగాత్రులను పరామర్శించి, వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం కోసం వారిని నెల్లూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేలా ఏర్పాట్లు చేశారు. మరోవైపు, ఈ విషయం తెలిసిన వెంటనే తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోన్ ద్వారా రాజీవ్ హనుమంతును పరామర్శించారు. ఆయన కుటుంబసభ్యుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.