భారత అండర్-19 జట్టు కెప్టెన్ లక్ష్య రాయ్‌చందానీపై ఉత్తరాఖండ్ సీనియర్ పురుషుల జట్టు హెడ్ కోచ్ మనీష్ ఝా ప్రశంసల వర్షం కురిపించాడు. క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా ఉండే తత్వం, మ్యాచ్ పరిస్థితులను చదివే అద్భుత నైపుణ్యం లక్ష్యను తోటి ఆటగాళ్ల కంటే ప్రత్యేకంగా నిలుపుతున్నాయని పేర్కొన్నాడు. ఇటీవల భారత జట్టు అండర్-19 ఆసియా కప్‌ను కైవసం చేసుకున్న నేపథ్యంలో, దేశవాళీ నుంచి అంతర్జాతీయ స్థాయికి వేగంగా ఎదుగుతున్న లక్ష్య నాయకత్వ లక్షణాలను మనీష్ ఝా ప్రత్యేకంగా ప్రస్తావించాడు.

స్టార్ స్పోర్ట్స్ వీడియోలో మాట్లాడిన మనీష్ ఝా, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వ శైలితో లక్ష్యను పోల్చాడు. "కొందరు ఆటగాళ్లు మైదానంలో దూకుడుగా కనిపిస్తారు, కొందరు పెద్దగా కనిపించకుండా తమ పనిని పూర్తి చేస్తారు. లక్ష్య గేమ్ సెన్స్ అద్భుతం. మ్యాచ్‌ను అతను అర్థం చేసుకునే తీరు చాలా బాగుంటుంది. తెరవెనుక ఉండి మొత్తం పనిని చక్కబెట్టే రకం అతను. సెంచరీ కొట్టినా సంబరాల్లో మునిగిపోడు, డకౌట్ అయినా కంగారుపడడు. ఎల్లప్పుడూ ఒకే రకమైన స్థితప్రజ్ఞతతో ఉంటాడు. ధోనీ కూడా మైదానంలో భావోద్వేగాలను పెద్దగా ప్రదర్శించేవారు కాదు. లక్ష్యలోనూ అదే ప్రశాంతత, స్పష్టత కనిపిస్తాయి" అని ఝా విశ్లేషించాడు.

ఉత్తరాఖండ్ సీనియర్ డ్రెస్సింగ్ రూమ్‌లో లక్ష్య వ్యవహారశైలిని వివరిస్తూ.. అతను మైదానంలో అతిగా అరవడం లేదా హడావుడి చేయడం వంటివి చేయకపోయినా, తెరవెనుక కోచ్‌లతో స్పష్టమైన చర్చలు జరుపుతాడని చెప్పాడు. "వికెట్ పడగానే అతిగా ఎగ్జైట్ అవ్వడం లేదా ఎక్కువగా మాట్లాడటం అతనిలో కనిపించదు. చేతలతోనే తన పనిని చూపిస్తాడు. సీనియర్ జట్టుతో ఉన్నప్పుడు కూడా ఎంతో పరిణతితో, అర్థవంతంగా మాట్లాడతాడు. అతడు నిజంగా గొప్ప ప్రతిభావంతుడు" అని కొనియాడాడు.

లక్ష్య ప్రదర్శనలు కూడా కోచ్ నమ్మకాన్ని నిజం చేస్తున్నాయి. 2025-26 రంజీ ట్రోఫీ సీజన్‌లో ఉత్తరాఖండ్ తరఫున 5 ఇన్నింగ్స్‌లలో 223 పరుగులు సాధించి సీనియర్ దేశవాళీ క్రికెట్‌లో తన సత్తా చాటాడు. నాకౌట్ దశల్లో బెంగాల్‌పై 86 పరుగులు, కర్ణాటకపై 55 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు.

అనంతరం 2026 జులైలో శ్రీలంక పర్యటనతో అంతర్జాతీయ యూత్ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన లక్ష్య, యూత్ టెస్టుల్లో భారీ శతకాలతో చెలరేగాడు. గాలేలో జరిగిన తొలి మ్యాచ్‌లో సాగర్ విర్క్‌తో కలిసి మొదటి వికెట్‌కు 295 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి, 324 బంతుల్లో 207 పరుగులు చేశాడు. ఆ తర్వాత కొలంబోలో జరిగిన రెండో టెస్టులోనూ 116 బంతుల్లో 100 పరుగులు సాధించి అదరగొట్టాడు.

అదే జోరును కొనసాగిస్తూ సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియా అండర్-19తో జరిగిన సిరీస్‌లో మూడో యూత్ వన్డేలో 110 పరుగులు, మొదటి యూత్ టెస్టులో 281 బంతుల్లో కెరీర్ బెస్ట్ 240 పరుగులు చేసి భారత్ ఇన్నింగ్స్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. యూత్ వన్డే కెప్టెన్‌గా, యూత్ టెస్ట్ వైస్ కెప్టెన్‌గా రాణించిన లక్ష్య, తాజాగా భారత జట్టును అండర్-19 ఆసియా కప్ విజేతగా నిలపడం విశేషం. కేవలం పరుగుల గణాంకాలు మాత్రమే కాకుండా, అతనిలోని అవగాహన, మానసిక పరిణతి భారత క్రికెట్ భవిష్యత్తుకు ఎంతో కీలకమని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.