ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (యూఎన్‌జీఏ) థర్డ్ కమిటీలో మరణశిక్షల అమలుపై ప్రపంచవ్యాప్త తాత్కాలిక నిషేధం విధించాలంటూ ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానానికి వ్యతిరేకంగా భారత్ ఓటు వేసింది. మెక్సికో ప్రతిపాదించిన ఈ తీర్మానానికి అనుకూలంగా 133 దేశాలు ఓటు వేయగా, భారత్‌తో సహా 33 దేశాలు వ్యతిరేకించాయి. మరో 16 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయని ది హిందూ కథనం పేర్కొంది.

న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఐరాసలోని భారత శాశ్వత మిషన్ ఫస్ట్ సెక్రటరీ భవిక మంగళానందన్ దేశ వైఖరిని స్పష్టం చేశారు. మరణశిక్షలకు సంబంధించి ప్రపంచ దేశాల మధ్య ఎలాంటి ఏకాభిప్రాయం లేదని ఆమె పేర్కొన్నారు. ప్రతి సార్వభౌమ దేశానికి తమ సొంత న్యాయ వ్యవస్థను, తగిన శిక్షలను నిర్ణయించుకునే పూర్తి హక్కు ఉంటుందని తెలిపారు. భారత్‌లో సరైన న్యాయ ప్రక్రియను, విస్తృతమైన రక్షణలను అనుసరించిన తర్వాతే కేవలం "అత్యంత అరుదైన కేసుల్లో" (రేరెస్ట్ ఆఫ్ రేర్) మాత్రమే మరణశిక్ష విధిస్తామని ఆమె వివరించారు.

చట్టబద్ధమైన విచారణ అనంతరం విధించే మరణశిక్షను అన్యాయమైన హత్యలతో లేదా హింసతో పోల్చడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని భారత్ స్పష్టం చేసింది. ఈ తీర్మానాన్ని భారత్‌తో పాటు అమెరికా, చైనా, జపాన్, పాకిస్థాన్, ఇరాన్, సౌదీ అరేబియా వంటి దేశాలు కూడా వ్యతిరేకించాయి. తమ దేశ చట్టాలకు లోబడి, న్యాయ సమీక్షల ద్వారానే తీవ్రమైన నేరాలకు శిక్షలు అమలు చేస్తామని భారత్ మరోసారి తేల్చిచెప్పింది.