టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ తన భార్య భూమా మౌనికపై ప్రశంసల జల్లు కురిపించారు. వారి స్టార్టప్ సంస్థ ‘నమస్తే వరల్డ్’ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కీలక ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఐదేళ్లుగా సంస్థ కోసం మౌనిక పడిన కష్టమే ఈ రోజు మంచి ఫలితాలను ఇస్తోందని పేర్కొన్నారు.

విశాఖపట్నంలో నిర్వహించిన 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఈ ఒప్పందం కుదిరింది. సుమారు రూ.36.24 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడితో కర్నూలు, విశాఖపట్నంలలో చేనేత వస్త్రాలు, స్థానిక బొమ్మల తయారీ కేంద్రాలను నమస్తే వరల్డ్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 950 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యంగా ఏటికొప్పాక, కొండపల్లి వంటి సంప్రదాయ కళలను ప్రోత్సహిస్తూ, స్థానిక చేనేత కార్మికులకు అండగా నిలవాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ సందర్భంగా మనోజ్ భావోద్వేగంగా పోస్ట్ చేశారు. ‘‘మౌనికా.. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. ఐదేళ్లుగా పట్టుదలతో నువ్వు చేసిన కష్టమే మనల్ని ఈ స్థాయిలో నిలబెట్టింది. 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఏపీ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నాం. తిరుపతిలో మన తొలి ఎంఓయూ కుదిరిన మూడు వారాల్లోనే ఈ ఘనత సాధించాం. మనల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చిన ఘనత నీదే’’ అని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని చేనేత కళాకారులు, మహిళలతో కలిసి పనిచేస్తూ భారతీయ కథలను బొమ్మలు, యానిమేషన్, ఏఐ వంటి ఆధునిక సాంకేతికత ద్వారా నేటి తరం పిల్లలకు చేరువ చేయాలనేది తమ ఆలోచన అని మనోజ్ తెలిపారు. ఈ సంస్థలో భూమా మౌనిక ఫౌండర్, సీఈవోగా వ్యవహరిస్తుండగా, మనోజ్ కో-ఫౌండర్, చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.