ఏపీలో సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల ప్రస్తుత పరిస్థితిపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రభుత్వం నిర్దేశించుకున్న 36 ప్రాజెక్టులను రాబోయే రెండున్నర సంవత్సరాల్లో పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

ఈ సమీక్షలో భాగంగా ఎత్తిపోతల పథకాల మరమ్మతులు, నిర్వహణ, ఇరిగేషన్ భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు వంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలోని సాగునీటి ఎత్తిపోతల ప్రాజెక్టులన్నింటినీ జలహారతి కార్పొరేషన్ ద్వారా పర్యవేక్షించాలని సీఎం సూచించారు. దీనివల్ల వాటి నిర్వహణ, పర్యవేక్షణ మరింత సమర్థవంతంగా జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

అలాగే, విద్యుత్ రంగానికి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఉన్న తరహాలోనే, జలవనరుల కోసం కూడా ప్రత్యేకంగా ఒక వాటర్ రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేసే అంశంపై అధ్యయనం చేయాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. ఈ కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ నిర్ణయాలతో సాగునీటి రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.