విజయనగరం జిల్లాలోని బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో తెదేపా అభ్యర్థి పాశల నీరజ విజయం సాధించారు. ఇక్కడ వైసీపీ తరఫున పోటీ చేసిన శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కుమార్తె అనూష ఓటమి పాలయ్యారు. నీరజ.. అనూషపై 5,136 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

నీరజ విజయం సాధించడంతో బొండపల్లిలో కూటమి శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. జడ్పీ ఛైర్‌పర్సన్‌ పదవి రేసులో ఉన్న అనూష ఓటమి వైసీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ట్రెండ్స్ ప్రకారం.. ఈ ఎన్నికల్లో అధికార కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. ప్రతిపక్ష వైసీపీ భారీ పరాజయం దిశగా పయనిస్తోంది. వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గంలోని పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని కూడా ఆ పార్టీ కోల్పోవడం గమనార్హం. ఈ ఫలితాలతో వైసీపీ శ్రేణులు తీవ్ర నిరాశలో మునిగిపోయాయి.